స్టార్ ఫైట్: రూ. 200 కోట్లపై కన్నేసిన మోహన్ లాల్... గండి కొట్టడానికి సిద్ధంగా ఉన్న మమ్ముట్టి?
మలయాళం చిత్ర సీమలో రూ. 50 కోట్ల వసూళ్లు సాధించడమే చాలా పెద్ద అచీవ్మెంట్. అలాంటి మార్కెట్లో తన సినిమాలను రూ. 100 కోట్ల స్థాయికి తీసుకెళుతూ సంచలనం క్రియేట్ చేస్తున్నారు కేరళ సూపర్ స్టార్ మోహన్ లాల్. 2016లో ఆయన నటించిన 'పులిమురుగన్' చిత్రం రూ. 150 కోట్లు వసూలు చేసి సంచలన క్రియేట్ చేసింది. తాజాగా మరోసారి ఆయన తన లేటెస్ట్ మూవీతో బాక్సాఫీసును షేక్ చేస్తున్నారు.
మోహన్ లాల్ నటించిన 'లూసిఫెర్' మూవీ కేరళ బాక్సాఫీసు వద్ద సంచలనాలు నమోదు చేస్తూ దూసుకెళుతోంది. మార్చి 28న విడుదలైన ఈ చిత్రం ఏప్రిల్ 8తో రూ. 100 కోట్ల మార్కును అందుకుంది. అత్యంత వేగంగా ఇంత భారీ మొత్తం వసూలు చేసిన చిత్రంగా రికార్డులకెక్కింది.

ఇద్దరి కాంబినేషన్ అదుర్స్.. బ్లాక్ బస్టర్ విజయం
ఈ చిత్రానికి మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. మోహన్ లాల్-పృథ్విరాజ్ సుకుమారన్ కాంబినేషన్ కావడంతో సినిమాపై భారీ హైప్ వచ్చింది. ప్రేక్షకుల అంచనాలు అందుకునే స్థాయిలో కంటెంట్ ఉండటంతో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

రూ. 200 కోట్ల దిశగా...
సినిమా విడుదలై తొలి వారం పూర్తయిన తర్వాత కూడా డిమాండ్ విపరీతంగా ఉంది. కేరళలో ఎక్కడ చూసినా ‘లూసిఫెర్' సినమా గురించిన చర్చే జరుగుతోంది. అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీ స్థాయిలో ఉంది. సినిమా జోరు చూస్తుంటే రూ. 200 కోట్ల మార్కును అందుకోబోయే తొలి మలయాళ మూవీ కావొచ్చనే అభిప్రాయాలు ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

త్వరలో సీక్వెల్ కూడా..
సినిమా విజయవంతం కావడంతో త్వరలో దీనికి సీక్వెల్ కూడా తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి పని చేసిన స్క్రీన్ రైటర్ మురళి గోపీ త్వరలోనే సీక్వెల్ ప్రారంభం అయ్యే అవకాశాలు లేకపోలేదని ఓ ఆంగ్లపత్రికకు వెల్లడించారు.

గండికొట్టడానికి సిద్ధంగా ఉన్న మమ్ముట్టి
అయితే ‘లూసిఫెర్' మూవీ రూ. 200 కోట్ల మార్కును అందుకోవడం అంత ఈజీకాదని మరికొందరి వాదన. మరో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టిన నటించిన ‘మధుర రాజా' చిత్రం ఏప్రిల్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. దాని ప్రభావం తప్పకుండా మోహన్ లాల్ మూవీపై ఉంటుందని అంటున్నారు.

మధుర రాజా
మధుర రాజా చిత్రానికి హిట్ చిత్రాల దర్శకుడు వైశాఖ్ దర్శకత్వం వహించారు. పూర్తి కమర్షియల్ చిత్రంగా దీన్ని తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా మమ్ముట్టి స్టార్ ఇమేజ్‌తో భారీ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











