MIB Day 14 Box Office: 100 కోట్లకు చేరువగా మా ఇంటి బంగారం.. సమంత మూవీ అరుదైన రికార్డు
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా సంచలనాలు నమోదు చేస్తూ 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లకు చేరువైంది. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిందిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దక్షిణాది రాష్ట్రాల్లోను, అలాగే ఓవర్సీస్‌లో భారీ వసూళ్లు సాధిస్తున్నది. ఈ సినిమాను సమంతతో కలిసి ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీముఖి, లక్ష్మీ, మంజూష, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రినివాస్ గవిరెడ్డి తదితరులు నటించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. రాజ్ నిడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. సినిమాటోగ్రఫి: ఓం ప్రకాశ్, మ్యూజిక్: సంతోష్ నారాయణన్, ఫైట్స్: లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, ప్రొడక్షన్ డిజైన్: ఉల్లాస్ హైదర్ తదితరలు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ వాల్యూ ఎంత? ఈ సినిమా ఇప్పటి వరకు ఎంత మేరకు వసూళ్లను సాధించింది అనే వివరాల్లోకి వెళితే..

యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమాను సుమారుగా 28 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ అమ్మకాలతో ఈ సినిమా 35 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రాన్ని కమీషన్ బేస్ మీద ట్రాలాలా సంస్థ సొంతంగా రిలీజ్ చేసింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 36 కోట్ల రూపాయల షేర్ వసూళ్లతో వాల్యూ చేశామని చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ సినిమా తొలివారం అంచనాలకు మించి వసూళ్లను సాధించింది. ఇండియాలో వివిధ రాష్ట్రాల్లో మొదటి వారం ఈ చిత్రం 39 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో వారంలో కలెక్షన్లు తగ్గుముఖం పట్టినప్పటికీ.. నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం 8వ రోజు 5 కోట్లకుపైగా, 9వ రోజు 5.75 కో ట్లు, 10వ రోజు 6 కోట్లకుపైగా, 11వ రోజు 2 కోట్ల రూపాయలు, 12వ రోజు 2 కోట్లు, 13వ రోజు 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం ఇండియాలో 67 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఈ సినిమా వివిధ రాష్ట్రాల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో 49 కోట్ల రూపాయలు (నైజాంలో 13.5 కోట్లు, ఏపీలో 10.5 కోట్ల నెట్), తమిళంలో 5 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 11 కోట్ల రూపాయలు, కేరళలో 25 లక్షల రూపాయలు, హిందీ రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 61 కోట్ల రూపాయల గ్రాస్, 53 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 24 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం 90 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
ఈ సినిమా ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ తెలుగు రాష్ట్రాల్లో 24 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. ఇక ఈ చిత్రం 14వ రోజున మరో 2 కోట్ల రూపాయల మేర వసూలు చేయవచ్చు. దాంతో ఈ చిత్రం 92 కోట్ల మేర కలెక్షన్లు నమోదు చేస్తుంది. ఈ వారం ముగిసే సమయానికి 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తున్నది. సమంత తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా వసూళ్లను రాబట్టింది.


Click it and Unblock the Notifications