MSVPG Day 1 AP- TG Collections: చిరంజీవి మాస్ రాంపేజ్... ఆంధ్రా, నైజాంలలో శంకర వరప్రసాద్ గారికి ఎన్ని కోట్లంటే
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటించిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా విడుదలైంది. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో అలరించారు. కేథరిన్ థ్రెసా, సచిన్ ఖేడేకర్, శరత్ సక్సేనా, మాస్టర్ రేవంత్, బేబీ ఐరా, హర్షవర్థన్‌లు తదితరులు నటించారు. ఈ నేపథ్యంలో మన శంకర వరప్రసాద్ గారు బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఆంధ్రా, తెలంగాణలలో తొలిరోజున మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే...
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సాహు గారపాటితో కలిసి చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం వహించారు, తమ్మిరాజు ఎడిటర్‌గా సేవలందించారు. రిలీజ్ రోజుకు ముందే జనవరి 11న తెలుగు రాష్ట్రాలు, నార్త్ అమెరికా సహా కొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్స్ ప్రదర్శించారు.

మన శంకర వరప్రసాద్ గారు బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 55 కోట్ల రూపాయలకు, నైజాం థియేట్రికల్ హక్కులు 32 కోట్ల రూపాయలు, సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 18 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 105 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది. దాంతో ఆంధ్రా, నైజాంలలో చిరంజీవి సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫ్ వద్ద 220 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ రాబట్టాల్సి ఉంది.
మన శంకర వరప్రసాద్ గారు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
ఇతర రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే... కర్ణాటకలో 10 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 5 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో మన శంకర వరప్రసాద్ గారు చిత్రం 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు మంచి బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు వెల్లడించారు. నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్‌ను 20 కోట్ల రూపాయలకు అమ్మారు. దాంతో చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీకి వరల్డ్ వైడ్‌గా 140 నుంచి 150 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మన శంకర వరప్రసాద్ గారు చిత్రం లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 280 కోట్లు నుంచి 300 కోట్ల రూపాయల రేంజ్‌లో కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నిర్దేశించారు.
మన శంకర వరప్రసాద్ గారు తొలి రోజు కలెక్షన్స్
మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఇండియాలో 8.60 కోట్ల రూపాయల నికర కలెక్షన్స్ వచ్చాయి. ఇక తొలిరోజున ఇండియా వైడ్‌గా 37.1 కోట్ల రూపాయల నెట్.... 44.25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ నివేదించింది. మన శంకర వరప్రసాద్ గారు ఓవర్సీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే... నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ + అడ్వాన్స్ సేల్స్‌తో 1.5 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 13 కోట్ల రూపాయలు) వసూలైంది. తొలిరోజున నార్త్ అమెరికాలో 300K డాలర్లు (2.70 కోట్ల రూపాయలు) గ్రాస్ వసూలు చేసింది. దాంతో నార్త్ అమెరికాలో శంకర వరప్రసాద్ గారు మూవీకి ప్రీమియర్స్ + డే 1 కలిపి దాదాపు 16 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చింది.
ఇక యూరప్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో 8 కోట్ల రూపాయల వరకు కలెక్షన్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతో ఓవర్సీస్ నుంచి ఈ సినిమాకు 25 కోట్ల రూపాయలు వసూలైంది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి తొలిరోజున 84 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వచ్చినట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్స్
మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి ప్రీమియర్స్‌లో మంచి వసూళ్లు వచ్చాయి. మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షోలకు కుటుంబ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో బలమైన కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్‌లో 8.6 కోట్ల రూపాయలు, తొలిరోజున 28.5 కోట్ల రూపాయలు చొప్పున 37.1 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ నివేదించింది.
కడపటి వార్తలు అందేసరికి మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి ఉత్తరాంధ్రలో 3.30 కోట్ల రూపాయల షేర్, సీడెడ్‌లో 6.90 కోట్ల రూపాయల షేర్, కృష్ణా జిల్లాలో 1.86 కోట్ల రూపాయల షేర్, నైజాంలో 7.90 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మొత్తానికి ఖైదీ నెంబర్ 150, సైరా నర్సింహారెడ్డి తర్వాత చిరంజీవి సినిమాకు ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం ఇదే తొలిసారి. దాంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











