Indra Re Release : రీరిలీజ్‌లో ఇంద్రసేనుడి వసూళ్ల సునామీ .. మహేశ్ బాబు రికార్డ్స్ గల్లంతు
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన బ్లాక్‌బస్టర్ మూవీ ఇంద్రను 4కే వెర్షన్‌లో ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్. అశ్వినీదత్ నిర్మాతగా బీ.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంద్రలో చిరంజీవి సరసన సోనాలీ బింద్రే , ఆర్తి అగర్వాల్‌లు హీరోయిన్లుగా నటించగా ప్రకాష్ రాజ్, ముఖేష్ రుషి, సునీల్ తదితరులు కీలకపాత్ర పోషించారు. జూలై 24, 2002న రిలీజైన ఇంద్ర బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌తో దక్షిణాదిలో ఈ ఘనత సాధించిన తొలి సినిమాగా నిలిచింది.
మహేశ్ బాబు - పూరి జగన్నాథ్‌ల పోకిరి రిలీజయ్యే వరకు టాలీవుడ్‌లో ఇంద్రదే అత్యధిక కలెక్షన్ల రికార్డు. కథ, కథనం, పాటలు , డైలాగ్స్, చిరంజీవి నటన అన్ని ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. అప్పట్లో టికెట్ రూ.5, రూ.10 కాబట్టి సరిపోయింది కానీ... ఈ రోజుల్లో అయితే ఏకంగా రూ.300 నుంచి రూ.400 కోట్లను ఇంద్ర అవలీలగా కొల్లగొట్టేదని ట్రేడ్ పండితులు చెబుతుంటారు. ఇప్పుడంటే ఆన్‌లైన్ పోర్టల్స్ అందుబాటులోకి వచ్చి టికెట్స్ దొరుకుతున్నాయి కానీ.. ఒకప్పుడు బ్లాక్ టికెట్ మాఫియా ప్రేక్షకులను దోచుకునేది.

అప్పట్లో రేటు ఎంతైనా సరే పర్లేదు ముందు బాస్ సినిమా బెనిఫిట్ షో చూడాలనుకునేవారు ఫ్యాన్స్. బ్లాక్‌లో అంత పెట్టి కొన్నా, ఇంత పెట్టి కొన్నానని వారు గర్వంగా చెప్పుకునేవారు కూడా . ఇంద్ర రిలీజ్ సమయంలో ఒక అభిమాని టికెట్‌ను రూ.2 వేల చొప్పున ఐదు టికెట్లను రూ.10 వేలు వెచ్చించి కొన్నాడు. 22 ఏళ్ల క్రితం పదివేల రూపాయలు అంటే చిన్న మొత్తం కాదు. ఈ విషయాన్ని దర్శకుడు బీ గోపాల్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీనిని బట్టి చిరంజీవిని ఆయన అభిమానులు ఎంతలా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇంతటి ప్రభంజనం సృష్టించిన ఇంద్రను 4కే వెర్షన్‌లో ఈ ఆగస్ట్ 22న రిలీజ్ చేసింది వైజయంతీ మూవీస్. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా సుమారు 400 థియేటర్లలో ఇంద్రను రీ రిలీజ్ చేశారు. దీంతో తెలుగునాట మెగా అభిమానులు సందడి చేశారు. చిరంజీవి భారీ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేసి తీన్‌మార్ డ్యాన్సులు, బాణాసంచా కాల్చారు. మెగాస్టార్ పుట్టినరోజు కావడంతో థియేటర్ల వద్ద ప్రేక్షకులకు స్వీట్లు పంచిపెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

మరోవైపు.. రీ రిలీజ్‌లోనూ ఇంద్ర ప్రభంజనం సృష్టిస్తున్నాడు. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 2 కోట్లకు పైగా గ్రాస్ సాధించగా.. కర్ణాటక సహా మిగిలిన రాష్ట్రాల్లో రూ.40 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.కోటికి గాపై వసూళ్లు సాధించింది. మొత్తంగా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 3.25 కోట్లు నుంచి రూ.3.50 కోట్ల వసూళ్లను రాబట్టాడు ఇంద్ర. ముఖ్యంగా కన్నడ నాట సెన్సేషనల్ ఓపెనింగ్స్‌తో బాస్ బీభత్సం సృష్టించాడు. కర్ణాటకలో రీ రిలీజైన టాలీవుడ్ చిత్రాల్లో వసూళ్లపరంగా గతేడాది వచ్చిన సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన బిజినెస్‌మెన్ రూ.27 లక్షలకు పైగా కలెక్షన్స్‌తో నెంబర్‌వన్‌గా నిలించింది.
ఇప్పుడు ఆ రికార్డును ఇంద్ర బద్ధలుకొట్టింది. తద్వారా రీ రిలీజ్‌ల పరంగా ఆల్‌టైం రికార్డుల కలెక్షన్స్‌ని మొదటి రోజే సొంతం సొంతం చేసుకుని తనకు తిరుగులేదని చాటి చెబుతున్నాడు ఇంద్రసేనుడు. చిరంజీవికి కర్ణాటకలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. 22 ఏళ్ల కిందట ఇంద్ర రిలీజ్ అయినప్పుడు కూడా అక్కడ వసూళ్ల వర్షం కురిసింది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తున్నారు చిరు.


Click it and Unblock the Notifications











