5600 కోట్ల కలెక్షన్లతో చరిత్ర సృష్టించిన మైఖేల్.. ఇండియాలో ఎన్ని కోట్లంటే?
కింగ్ ఆఫ్ పాప్, లెజెండరీ సింగర్ మైఖేల్ జాక్సన్ జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకొని రూపొందిస్తున్న అమెరికన్ మ్యూజికల్ బయోగ్రాఫికల్ డ్రామా మైఖేల్ (Michael). మైఖేల్ జాక్సన్ పాత్రలో ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ సినీ రంగ ప్రవేశం చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రానికి జాన్ లోగన్ రచనా సహకారం అందించగా, ఆంటోని ఫుక్వా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మైఖేల్ జాక్సన్ తండ్రిగా కాల్మన్ డొమింగో, తల్లిగా మైల్స్ టెల్లెర్, సుజాన్ డీ పాసేగా లారా హారియర్ తదితరులు నటిస్తున్నారు.
వరల్డ్ పాప్ కింగ్ జాక్సన్ బయోపిక్‌ను గ్రాహం కింగ్, జాన్ బ్రాంకా, జాన్ మెక్లెయిన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి డియాన్ బీబే సినిమాటోగ్రఫి, జాన్ ఓట్టమన్ ఎడిటింగ్, మ్యూజిక్: లియర్ రాస్నర్ తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. లయన్స్ గేట్ ఫిల్మ్స్, జీకే ఫిల్మ్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 24వ తేదీన గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

మైఖేల్ జాక్సన్ బయోపిక్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమాను సుమారుగా 200 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 1900 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఈ సినిమా 200 మిలియన్ డాలర్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
మైఖేల్ చిత్రం తొలి రోజు తడబాటు కనిపించినా ఆ తర్వాత రోజుల్లో పుంజుకొన్నది. ఈ చిత్రం తొలివారాంతమే 19 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. తొలి వారం ముగిసే సమయానికి 26 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో వారంలో 18 కోట్ల రూపాయల వసూలు చేసి మొత్తంగా 44 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. మూడో వారంలో కొనసాగుతూ ఇప్పటి వరకు 54 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు, 64 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఈ చిత్రం నార్త్ అమెరికాలో భారీగా వసూళ్లను సాధించింది. అమెరికా, కెనడాలో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. ఈ చిత్రం గత 20 రోజుల్లో 245 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 2343 కోట్లకుపైగా వసూలు చేసింది. అమెరికేతర దేశాల విషయానికి వస్తే.. ఈ చిత్రం యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, న్యూజిలాండ్, ఇటలీ, గల్ఫ్ దేశాల్లో భారీగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం అమెరికేతర దేశాల్లో సుమారుగా 336 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 3300 కోట్ల రూపాయలను వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం మొత్తంగా 584 మిలియన్ డాలర్ల మేర కలెక్షన్లను సాధించింది.
మైఖేల్ చిత్రం వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియా, నార్త్ అమెరికా, ఇతర దేశాలతో కలిపి రికార్డు కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రం ఇప్పటి వరకు 5500 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం ఇంకా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ కలెక్షన్లను రాబడుతున్నది. ఈ చిత్రం భారీ లాభాలను నమోదు చేసుకొంటూ ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రేసులో ఉంది. ఇటీవల రిలీజైన బొహెమియాన్ రాప్సోడి అనే చిత్రం కలెక్షన్లను అధిగమించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications

