9 రోజుల్లో 4000 కోట్ల కలెక్షన్లు.. బాక్సాఫీస్ చరిత్ర సృష్టించిన మైఖేల్
కింగ్ ఆఫ్ పాప్, లెజెండరీ సింగర్ మైఖేల్ జాక్సన్ జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకొని రూపొందిస్తున్న అమెరికన్ మ్యూజికల్ బయోగ్రాఫికల్ డ్రామా మైఖేల్ (Michael). మైఖేల్ జాక్సన్ పాత్రలో ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ సినీ రంగ ప్రవేశం చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రానికి జాన్ లోగన్ రచనా సహకారం అందించగా, ఆంటోని ఫుక్వా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మైఖేల్ జాక్సన్ తండ్రిగా కాల్మన్ డొమింగో, తల్లిగా మైల్స్ టెల్లెర్, సుజాన్ డీ పాసేగా లారా హారియర్ తదితరులు నటిస్తున్నారు.
వరల్డ్ పాప్ కింగ్ జాక్సన్ బయోపిక్‌ను గ్రాహం కింగ్, జాన్ బ్రాంకా, జాన్ మెక్లెయిన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి డియాన్ బీబే సినిమాటోగ్రఫి, జాన్ ఓట్టమన్ ఎడిటింగ్, మ్యూజిక్: లియర్ రాస్నర్ తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. లయన్స్ గేట్ ఫిల్మ్స్, జీకే ఫిల్మ్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 24వ తేదీన గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

మైఖేల్ జాక్సన్ బయోపిక్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమాను సుమారుగా 200 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 1900 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఈ సినిమా 200 మిలియన్ డాలర్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇండియాలో మైఖేల్ చిత్రం ఓ మోస్తారుగా కలెక్షన్లను నమోదు చూస్తున్నది. గత 9 రోజుల్లో ఈ సినిమా సుమారుగా 40 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 23 తేదీన ప్రీమియర్ల ద్వారా 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి రో జు 3.7 కోట్లు, రెండో రోజు 5.25 కోట్లు, మూడో రోజు 5.85 కోట్లు, 4వ రోజు 2.25 కోట్ల రూపాయలు, 5వ రోజు 2.4 కోట్ల రూపాయలు, 6వ రోజు 2.4 కోట్ల రూపాయలు, 7వ రోజు 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి వారం 26.5 కోట్ల రూపాయలు రాబట్టింది. రెండో వారంలో కూడా స్ట్రాంగ్‌గా కలెక్షన్లను సాధించింది. 8వ రోజు 3.5 కోట్ల రూపాయలు, 9వ రోజు 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో ఇప్పటి వరకు 34 కోట్ల నెట్, 40 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.
ఓవర్సీస్ మార్కెట్‌లో మైఖేల్ భారీ ఆదరణ దక్కుతున్నది. ఈ సినిమా యూకేలో22 మిలియన్ డాలర్లు, ఫ్రాన్స్‌లో 1.4 మిలియన్ డారల్లు, మెక్సికోలో 13 మిలియన్ డారల్లు, ఇటలీ, బ్రెజిల్, జర్మనీ, స్పెయిన్ దేశాల్లో 10 మిలియన్ డాలర్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. మిడిల్ ఈస్ట్‌లో 1 మిలియన్ డాలర్లు, చైనాలో7 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. నార్త్ అమెరికాలో కలెక్షన్లు కలిపి ఈ చిత్రం 425 మిలియన్ డాలర్లు అంటే.. 4000 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
మైఖేల్ సినిమా మ్యూజిక్ బయోపిక్స్‌లో రికార్డు క్రియేట్ చేసింది. ఇంతకు ముందు వచ్చిన బొహెమియన్ రాప్సోడీ 900 మిలియన్లు కలెక్ట్ చేసింది. లెజెండరీ సింగర్స్ ఎల్వీస్ 288 మిలియన్ డాలర్లు వసూలు చేయగా.. ప్రస్తుతం మైఖేల్ 425 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచింది.


Click it and Unblock the Notifications