Most Eligible Bachelor Box Office Collections: 5 రోజుల్లోనే అన్ని కోట్ల టార్గెట్ ఉఫ్.. అఖిల్ సంచలన రికార్డు
అక్కినేని ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా కాలంగా విజయ కోసం వేచి చూస్తున్నాడు హ్యాండ్సమ్ హీరో అఖిల్. తెరంగేట్రం చేసి చాలా కాలమే అవుతోన్నా.. సక్సెస్‌ను మాత్రం అందుకోవడం అతడు విఫలం అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాను చేశాడు. దసరా కానుకగా వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను దాటేసింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్టుపై మీరూ ఓ లుక్కేయండి మరి!

‘బ్యాచ్‌లర్' అంటూ వచ్చిన అఖిల్
అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన చిత్రమే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం దసరా కానుకగా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

హిట్ లేకున్నా భారీ స్థాయి బిజినెస్‌తో
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 17.50 కోట్ల వ్యాపారం జరుపుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా కూడా బాగానే ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో కలిపి దీనికి రూ. కోటి బిజినెస్ జరిగిందట. వీటితో కలుపుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 18.50 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం.

భారీ అంచనాలు.. టాక్ కూడా అదేలా
ఫీల్ గుడ్ రొమాంటిక్ జోనర్‌లో అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నుంచి ఏది విడుదలైన భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక, దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి టాక్ వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది.

ఐదో రోజు ఎక్కడ ఎంత వచ్చిందంటే
అఖిల్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఐదో రోజూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 55 లక్షలు, సీడెడ్‌లో రూ. 27 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 16 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 1.31 కోట్లు షేర్, రూ. 1.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లెంత
ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రూ. 16.92 కోట్లు కొల్లగొట్టిన అఖిల్ మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.22 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.20 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఐదు రోజుల్లో దీనికి రూ. 20.34 కోట్లు షేర్‌తో పాటు రూ. 33.85 కోట్లు గ్రాస్ వచ్చింది. దీంతో రికార్డులు బద్దలయ్యాయి.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వచ్చిందిలా
ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19 కోట్లుగా నమోదైంది. ఇక, ఐదు రోజుల్లో దీనికి రూ. 20.34 కోట్లు వచ్చాయి. దీంతో దీనికి హిట్ స్టేటస్ రావడంతో పాటు రూ. 1.34 కోట్లు లాభాలు కూడా వచ్చాయి.

అఖిల్ అరుదైన ఘనత.. ఆరో స్థానం
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ ఐదు రోజుల్లోనే టార్గెట్‌ను చేరుకుంది. ఫలితంగా అఖిల్ ఖాతాలో మొదటి హిట్ వచ్చి చేరింది. దీంతో అతడి పరాజయాలకు బ్రేక్ పడి రికార్డు నమోదైంది. ఇక, ఈ ఏడాది విజయం సాధించిన చిత్రాల్లో ఇది 13వది. అలాగే, 2021లో ఎక్కువ షేర్ సాధించిన చిత్రాల్లో 'బ్యాచ్‌లర్' ఆరో స్థానానికి చేరుకుంది. ఈ జాబితాలో వకీల్ సాబ్ ముందుంది.


Click it and Unblock the Notifications











