Mathu Vadalara 2 Day 1 Collections : మత్తు వదలరా 2 కి రికార్డు వసూళ్లు.. ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే?
ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సంచలనం సృష్టిస్తున్నాయి. కమిటీ కుర్రోళ్లు, ఆయ్, 35 చిన్న కథ కాదు వంటి స్మాల్ బడ్జెట్ సినిమాలు మంచి వసూళ్లను సాధించి చిన్న సినిమా సత్తాను చాటాయి. ఈ కోవలోనే శ్రీసింహా, కమెడియన్ సత్య , వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన మత్తు వదలరా 2 ఈ సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా విడుదలైన మత్తు వదలరా 2 కలెక్షన్ల విషయంలో పెద్ద సినిమాలకే పోటీనిస్తోంది. ఈ వివరాల్లోకి వెళితే..
క్రైమ్ , కామెడీ తరహాల్లో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది మత్తు వదలరా 2. ఐదేళ్ల క్రితం రితేష్ రాణా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనాన్ని బాగా నవ్వించింది. ముఖ్యంగా తస్కరణ అనే పదం బాగా పాపులర్ అయ్యింది. దొంగతనం చేయడానికి కొత్త నిర్వచనమా అంటూ ప్రేక్షకులు బాగా నవ్వుకున్నారు. అలాంటి సినిమాకు సీక్వెల్ అనేసరికి ఆడియన్స్‌లోనూ మంచి అంచనాలున్నాయి. సెప్టెంబర్ 13న రిలీజైన మత్తువదలరా 2కు మంచి రివ్యూలు, మౌత్ టాక్ దక్కినట్లుగా ఫిలింనగర్ టాక్.

శ్రీ సింహా హీరో కావడంతో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుటుంబం ఈ మూవీకి అండగా నిలిచింది. స్వయంగా జక్కన్న ప్రమోషన్ చేయడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారింది. హై ఎమర్జెన్సీ అనే టీమ్‌లో సత్య, శ్రీసింహాలు ఉద్యోగం సంపాదించుకుని అక్కడ కిడ్నాప్ అయిన కేసులను డీల్ చేస్తుంటారు. తమకు వచ్చే జీతం ఎందుకూ చాలకపోవడంతో తస్కరణ అనే విద్యను మరోసారి వాడాల్సి వస్తుంది. ఈ క్రమంలో రెండు హత్య కేసుల్లో ఇరుక్కుని చిక్కుల్లో పడతారు. ఈ కేసుల్లోంచి శ్రీసింహా, సత్యలు ఎలా బయటపడ్డారు, ఎవరు వారిని ఇరికించారు , ఫరియా అబ్దుల్లా క్యారెక్టర్‌తో వీరికి ఉన్న సంబంధం ఏంటీ అన్నదే మత్తువదలరా 2 కథ.
మత్తువదలరా 2కి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. నైజాం రూ.కోటిన్నర, సీడెడ్ రూ.50 లక్షలు, ఆంధ్ర రూ.1.20 కోట్లు , ఏపీ తెలంగాణ కలిపి టోటల్‌గా రూ.3.20 కోట్లకు, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ రూ.80 లక్షలు, వరల్డ్ వైడ్ టోటల్‌గా రూ.4 కోట్ల మేర మత్తు వదలరా 2 థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తద్వారా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.4 కోట్లు. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్సే ఓన్‌గా రిలీజ్ చేసుకున్నారు.

చిన్న సినిమాగా విడుదలైన మత్తు వదలరా 2 కలెక్షన్ల విషయంలో పెద్ద సినిమాలకు చెమటలు పట్టించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.5.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి చిత్ర పరిశ్రమనే ఆశ్చర్య పరిచింది. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసింది. అమెరికాలోమత్తు వదలరా 2 కలెక్షన్ల ప్రభావం ఎక్కువగా ఉంది. అక్కడి ఆడియన్స్‌కు ఈ మూవీ బాగా నచ్చిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్‌తో కలిపి 3 లక్షల డాలర్ల మార్క్‌ని చేరుకుని వడివడిగా మిలియన్ వైపు పరుగులు తీస్తోంది. రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్, రవితేజ మిస్టర్ బచ్చన్‌లు ఫుల్ రన్‌లో సాధించిన వసూళ్లను మత్తువదలరా 2 ఆల్రెడీ అధిగమించి షాకిచ్చింది. శని, ఆదివారాలు , సోమవారం కూడా కొన్ని ఏరియాలలో సెలవు దినం కావడంతో మత్తు వదలరా 2 కలెక్షన్స్ కుమ్మేస్తుందని అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.


Click it and Unblock the Notifications











