Daaku Maharaaj Day 6 Box Office : వెంకీతో నువ్వా నేనా అంటోన్న బాలయ్య .. కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ - బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన హై వోల్టేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తనకు బాగా కలిసొచ్చిన సంక్రాంతి సీజన్‌లో బాలయ్య తన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన డాకు మహారాజ్ 6వ రోజు ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టాడో చూస్తే.
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టి మంచి ఊపులో ఉన్నాడు బాలయ్య. అదే రేంజ్‌లో వరుస విజయాలతో ఊపు మీదున్న దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ) జత కలవడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై బాలయ్య వీరాభిమాని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు భారీ బడ్జెట్‌తో డాకు మహారాజ్‌ను నిర్మించారు. ఇందులో నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రద్ధా శ్రీనాథ్ , చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్ , హిమజ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. థమన్ స్వరాలు సమకూర్చారు.

టీజర్ , ట్రైలర్లతో పాటు బాలకృష్ణ లుక్ తదితర కారణాలతో డాకు మహారాజ్‌పై భారీ హైప్ నెలకొంది. దీనికి తగ్గట్లుగానే బాలయ్య సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగింది. నైజాంలో రూ. 17.50 కోట్లు, రాయలసీమలో రూ.15.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.6 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.5 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ. 5.4 కోట్లు, గుంటూరులో రూ. 7.2 కోట్లు, నెల్లూరులో రూ.2.7 కోట్లు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 67.30 కోట్ల బిజినెస్ చేసింది డాకు మహారాజ్.
అటు ఓవర్సీస్‌లో రూ.8 కోట్లు, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి రూ.5.40 కోట్లు మొత్తంగా రూ.80.70 కోట్లు బిజినెస్ చేసింది. ఇది ఇప్పటి వరకు బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ . దీంతో డాకు మహారాజ్ లాభాల బాట పట్టాలంటే రూ.82 కోట్ల షేర్.. రూ. 170 కోట్లను బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు.
స్పెషల్ షోల నుంచే మంచి టాక్ , పాజిటివ్ రివ్యూలతో హిట్ టాక్ తెచ్చుకున్న డాకు మహారాజ్ ప్రపంచవ్యాప్తంగా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి రోజు రూ. 56 కోట్ల రికార్డు ఓపెనింగ్స్ అందుకున్న డాకు మహారాజ్ .. రెండో రోజు రూ. 13.50 కోట్లు, మూడో రోజు రూ. 12.50 కోట్లు, నాలుగో రోజు రూ. 9.75 కోట్లు, ఐదవ రోజు రూ. 6.25 కోట్లు రాబట్టింది. ఇక ఆరో రోజు కొన్ని ఏరియాల్లో ఈ సినిమాకు బుకింగ్స్ డ్రాప్ అయ్యాయి. మొత్తంగా ఆరవ రోజు రూ. 4.11 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాడు బాలయ్య. వీకెండ్ కావడంతో శని, ఆదివారాల్లో బుకింగ్స్ బాగుంటాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. చూద్దాం మరి డాకు మహారాజ్ ఎలాంటి మేజిక్ చేస్తాడో?


Click it and Unblock the Notifications











