Court 19 days Collections : టఫ్ ఫైట్‌లోనూ ప్రియదర్శి హవా.. కోర్ట్ మూవీకి వసూళ్ల జాతర, ఎన్ని కోట్లు అంటే?
హీరోగానే కాకుండా నిర్మాతగా తనకంటూ ఓ బ్రాండ్ సృష్టించుకున్నాడు నేచురల్ స్టార్ నాని. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌ను స్థాపించి విభిన్నమైన చిత్రాలు తెరకెక్కించారు. ఆయన సంస్థ నుంచి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా ఏదో ఒక విషయం ఉందనేలా గుర్తింపు తెచ్చుకున్నారు నాని. తాజాగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని నిర్మించిన చిత్రమే కోర్ట్. కామెడీతో పాటు సరైన పాత్ర దొరికితే ఉతికి ఆరేస్తానని నిరూపించుకున్న ప్రియదర్శి ఇందులో లీడ్ రోల్ పోషించారు.
భారతదేశ న్యాయ వ్యవస్థ, ప్రధానంగా పోక్సో చట్టంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను నిర్మించారు. విడుదలైన తొలి రోజే హిట్ టాక్ తెచ్చుకున్న నాని చిత్రం వసూళ్ల విషయంలోనూ దుమ్మురేపింది. కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కొట్టేసిన కోర్ట్ మూవీ లాభాల పంట పండిస్తోంది. 10 రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్‌లో చేరి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. మరి 19 రోజుల వరకు కోర్ట్ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే:

వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై రామ్ జగదీష్ దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు దాదాపు రూ.10 కోట్ల బడ్జెట్ అయ్యింది. హర్ష్ రోషన్, సాయికుమార్, శివాజీ, హర్షవర్థన్, రోహిణి, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విషికా కీర్తి, శ్రీదేవి అపాళ్ల తదితరులు కీలకపాత్రలు పోషించారు. విజయ్ బుల్గానియన్ సంగీతం అందించగా .. హోలీ కానుకగా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా కోర్ట్ చిత్రం గ్రాండ్‌గా రిలీజైంది.
నాని నిర్మాత కావడం, ప్రియదర్శి గత చిత్రాల నేపథ్యంలో కోర్ట్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.11 కోట్ల షేర్.. రూ.22 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. అన్ సీజన్‌లోనూ మంచి హోల్డ్ సాధిస్తున్న కోర్ట్ మూవీ.. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం అందుకుని నటీనటులకు మంచి పేరు తీసుకొచ్చింది. ముఖ్యంగా సీనియర్ నటుడు శివాజీ తనలోని మరో కోణాన్ని బయటపెట్టారు.
రెండు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న కోర్ట్ చిత్రం .. మూడో వారంలోనూ దుమ్మురేపుతోంది. వీకెండ్ , ఉగాది, రంజాన్ పండుగలను బాగానే క్యాష్ చేసుకుంది. గత శనివారం రూ.46 లక్షలు, ఆదివారం ఉగాది పండుగ నాడు రూ.1.03 కోట్లు, సోమవారం రంజాన్ నాడు రూ.65 లక్షలు అందుకుని వసూళ్ల మోత మోగించింది. ఇక 19వ రోజు మంగళవారం కోర్ట్ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే.. ఫెస్టివల్ సీజన్, వీకెండ్ ముగిసినా, టఫ్ ఫైట్‌లోనూ ప్రియదర్శి చిత్రం మంచి వసూళ్లు సాధించింది.
19వ రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 45 లక్షల గ్రాస్ రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్‌తో కలిపి ఈ మొత్తం రూ. 50 లక్షల పైనే ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దీనితో కలిపి 19 రోజుల వరకు కోర్ట్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.54.33 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సాక్‌నిక్ నివేదించింది. ఇందులో ఇండియా వైడ్‌గా రూ.44.33 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.10 కోట్లు అందుకుంది. మరి బాక్సాఫీస్ వద్ద పరుగు ముగించే నాటికి ప్రియదర్శి చిత్రం ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











