Court Box Office: ప్రియదర్శి వసూళ్ల విధ్వంసం.. రెండో రోజు ఎన్ని కోట్లంటే?
బలగం, మల్లేశం వంటి చిత్రాలతో తనలోని నటుడిని పరిచయం చేసిన ప్రియదర్శి లీడ్ రోల్‌లో చేసిన చిత్రం కోర్ట్. విడుదలకు ముందే ప్రమోషన్ కార్యక్రమాలతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు నేచురల్ స్టార్ నాని తన వాల్ పోస్టర్ సినిమాపై ఈ చిత్రాన్ని నిర్మించడం ప్లస్‌గా మారింది. నాని ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమా వస్తుందంటే అందులో ఖచ్చితంగా ఏదో ఉంటుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. తొలి రోజు రికార్డ్ ఓపెనింగ్స్‌తో దుమ్ము దులిపిని కోర్ట్ రెండో రోజు ఎన్ని కోట్లు కొల్లగొట్టిందో చూస్తే :
ప్రియదర్శి, హర్ష్ రోషన్, సాయికుమార్, శివాజీ, హర్షవర్థన్, రోహిణి, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విషికా కీర్తి, శ్రీదేవి అపాళ్ల తదితరులు ఈ చిత్రంలో నటించారు. విజయ్ బుల్గానియన్ సంగీత దర్శకత్వం వహించగా.. రామ్ జగదీష్ కోర్ట్ మూవీని డైరెక్ట్ చేశారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేనేని ఈ సినిమాను నిర్మించగా.. నేచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వ్యవహరించారు. హోలీ పర్వదినం కానుకగా మార్చి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

దాదాపు రూ.10 కోట్ల బడ్జెట్‌తో కోర్ట్ సినిమాను నిర్మించగా.. రూ.10 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.11 కోట్ల షేర్.. రూ.22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావాలని ట్రేడ్ పండితులు విలువకట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 650 థియేటర్‌లలో విడుదల చేశారు. పండగతో పాటు పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడ్టారు. తొలి రోజు రికార్డు స్థాయిలో రూ.5 కోట్ల ఓపెనింగ్స్ సాధించిన కోర్ట్.. ప్రియదర్శి కెరీర్‌లోనే అత్యధికంగా నిలిచింది.
సినిమా విడుదలకు ముందు 100 పెయిడ్ ప్రీమియర్స్‌ను ప్రదర్శించారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా రూ. 40 లక్షల గ్రాస్ రాబట్టింది కోర్ట్. తొలి రోజు ఓపెనింగ్స్ దృష్ట్యా థియేటర్ల సంఖ్యను మరింత పెంచారు నిర్మాతలు. నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా నుంచి తొలి ప్రాజెక్ట్‌గా వచ్చిన ఆ చిత్రం.. తొలి రోజు రూ.3.6 కోట్ల ఓపెనింగ్స్ వసూలు చేసింది. ఇప్పుడు ప్రియదర్శి చిత్రం తొలిరోజు రూ.4.5 కోట్ల ఓపెనింగ్స్‌తో ఆ సినిమా రికార్డులను బద్ధలుకొట్టింది. అలాగే ప్రియదర్శి హీరోగా వచ్చిన డార్లింగ్ చిత్రం గతేడాది జూలైలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.2.13 కోట్ల ఓపెనింగ్స్ రాగా.. దానిని కోర్ట్ చిత్రం అధిగమించింది.
ఇక కోర్ట్ చిత్రం రెండో రోజు వసూళ్ల విషయానికి వస్తే.. శనివారం ఈ కోర్ట్ డ్రామాను జనం బాగానే ఆదరించారు. మార్నింగ్ షోలకు 34.05 శాతం, మ్యాట్నీ షోలకు 55.04 శాతం, ఫస్ట్ షోలకు 59.35 శాతం, సెకండ్ షోలకు 68.32 శాతం ఆక్యూపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 431 షోలు, బెంగళూరులో 220 షోలు, విశాఖపట్నంలో 106 షోలు పడ్డాయి. రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన కోర్ట్ చిత్రం ఈ వీకెండ్ నాటికి బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కొట్టేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి లాంగ్ రన్‌లో ప్రియదర్శి చిత్రం ఏ మేరకు వసూళ్లు సాధిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











