Court Box Office: ప్రియదర్శి ఊచకోత.. లాభాల్లోకి కోర్ట్, నాని మూవీకి ఎన్ని కోట్లంటే?
కంటెంట్ ఉన్న సినిమాలలో ఏరి కోరి నటించి భారీ హిట్లను తన ఖాతాలలో వేసుకుంటున్నారు యువ నటుడు, కమెడియన్ ప్రియదర్శి. బలగం, మల్లేశం, జాతిరత్నం సినిమాలు ఆయనను మరో స్థానంలో నిలబెట్టాయి. దీంతో చిన్న నిర్మాతలకు ఆయన కల్పవృక్షంలా మారారు. తాజాగా ప్రియదర్శి నటించిన చిత్రం కోర్ట్. సామాజిక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన రెండ్రోజుల్లోనే రూ.15 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన కోర్ట్ మూడో రోజు ఎన్ని కోట్లు అందుకుందో చూస్తే :
నూతన దర్శకుడు రామ్ జగదీష్ డైరెక్షన్‌లో వచ్చిన కోర్ట్ చిత్రంలో హర్ష్ రోషన్, సాయికుమార్, శివాజీ, హర్షవర్థన్, రోహిణి, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విషికా కీర్తి, శ్రీదేవి అపాళ్ల తదితరులు కీలకపాత్రలు పోషించారు. బేబీ మూవీ ఫేమ్ విజయ్ బుల్గానియన్ సంగీత దర్శకత్వం వహించారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేనేని ఈ సినిమాను దాదాపు రూ. 10 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కించగా.. నేచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వ్యవహరించారు.

వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ నుంచి వస్తున్న బొమ్మ కావడంతో పాటు ప్రియదర్శికి ఉన్న ఇమేజ్ దృష్ట్యా కోర్ట్ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. ఆంధ్రా, నైజాం, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి మొత్తంగా రూ.10 కోట్ల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితులు తెలిపారు. కోర్ట్ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.11 కోట్ల షేర్.. రూ.22 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాలని విలువ కట్టారు. అన్ సీజన్‌లోనూ కేవలం కంటెంట్ మీద నమ్మకంతో ఈ సినిమాను మార్చిలో రిలీజ్ చేసి ప్రయోగం చేశారు నాని.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 650 థియేటర్‌లలో విడుదలైన కోర్ట్ చిత్రం మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. తొలి రెండ్రోజుల్లో రూ.15.90 కోట్లతో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను ఛేదించిన ఈ సినిమా మూడో రోజైన ఆదివారం మంచి ఆక్యూపెన్సీ నమోదు చేసింది. మార్నింగ్ షోలకు 39.29 శాతం, మ్యాట్రీలకు 65.40 శాతం, ఫస్ట్ షోలకు 70.84 శాతం, సెకండ్ షోలకు 58.06 శాతం మేర ఆక్యూపెన్సీ నమోదైంది. మూడో రోజు హైదరాబాద్‌లో 475 షోలు, బెంగళూరులో 244 షోలు, విజయవాడలో 107, విశాఖపట్నంలో 114 షోలు పడ్డాయి.
మూడో రోజు ఈ సినిమా రూ.6.5 కోట్ల గ్రాస్ వసూళ్లతో దుమ్ము రేపింది కోర్ట్. మొత్తంగా మూడు రోజుల్లోనే రూ. 24 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అందుకుని లాభాల బాట పట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.14.4 కోట్లు, కర్ణాటకలో రూ.1.89 కోట్లు, తమిళనాడులో రూ.37 లక్షలు, కేరళలలో రూ.4 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ.41 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.6.90 కోట్లు రాబట్టింది కోర్ట్. సోమవారం నుంచి వర్కింగ్ డేస్ మొదలుకావడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో కోర్ట్ సినిమాకు ఎలాంటి వసూళ్లు వస్తాయోనని ఉత్కంఠ నెలకొంది.


Click it and Unblock the Notifications











