Court Day 6 Collection: నాని సినిమాపై ఆ ఎఫెక్ట్.. దారుణంగా వసూళ్లు, ప్రియదర్శి మూవీకి ఎన్ని కోట్లంటే?
కంటెంట్ బాగుంటే చిన్న సినిమా , పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఆదరిస్తామని ప్రేక్షకులు ఇటీవలి కాలంలో నిరూపిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో , ఎన్నో అంచనాల మధ్య విడుదలైన పెద్ద సినిమాలు బొక్కబోర్లా పడుతుంటే .. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు దుమ్ము దులుపుతున్నాయి. ఊహకందని కలెక్షన్స్‌తో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను అందిస్తున్నాయి ఈ చిన్న సినిమాలు. ఈ కోవలోకే వస్తుంది కోర్ట్. ప్రియదర్శి హీరోగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. 6వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :
రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని దాదాపు రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించారు. హర్ష్ రోషన్, సాయికుమార్, శివాజీ, హర్షవర్థన్, రోహిణి, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విషికా కీర్తి, శ్రీదేవి అపాళ్ల తదితరులు కీలకపాత్రలు పోషించారు. విజయ్ బుల్గానియన్ స్వరాలు సమకూర్చగా.. హోలీ కానుకగా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

కమెడియన్‌గా ఉంటూనే హీరోగా మెరుపులు మెరిపిస్తున్న ప్రియదర్శి గతంలో మల్లేశం, బలగం లాంటి సినిమాలతో తనలోని నటుడిని ఆవిష్కరించారు. ఆయన హీరోగా రావడంతో పాటు ఆ చిత్రానిని నేచురల్ స్టార్ నాని నిర్మాత కావడం సినిమాపై భారీ అంచనాలను తీసుకొచ్చింది. నాని తన వాల్ పోస్టర్ సినిమాపై తెరకెక్కించిన సినిమాలలో ఏదో ఒక ప్రత్యేకత ఉండటం ప్రియదర్శి ప్రాజెక్ట్‌కు కూడా కలిసొచ్చింది.
టీజర్, ట్రైలర్, ఇతర ప్రమోషన్ కార్యక్రమాలతో కోర్ట్ సినిమాకు బిజినెస్ బాగా జరిగింది. ఆంధ్రా, నైజాం, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ.10 కోట్ల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితులు తెలిపారు. కోర్ట్ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.11 కోట్ల షేర్.. రూ.22 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాలని ఇండస్ట్రీ వర్గాలు విలువ కట్టాయి.
కానీ ఎవ్వరూ ఊహించని విధంగా కోర్ట్ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ని ఊదిపారేసి ప్రాఫిట్ జోన్‌లోకి వచ్చేసింది. 5 రోజుల్లో ఒక్క ఇండియాలోనే రూ. 23 కోట్లను నికరంగా సాధించింది కోర్ట్ సినిమా. ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో రూ. 33 కోట్ల గ్రాస్ రాబట్టి నిర్మాత నానికి సాలీడ్ లాభాలను అందిస్తోంది కోర్ట్. వీకెండ్‌లో స్ట్రాంగ్ హోల్డ్ చూపించిన ప్రియదర్శి చిత్రం వర్కింగ్ డేస్‌లో డల్‌గా సాగుతోంది. సోమవారం 3 కోట్లు, మంగళవారం రూ. 2.75 కోట్లను రాబట్టిన ఈ చిత్రం.. 6వ రోజైన బుధవారం మరోసారి భారీగా డ్రాప్స్ చూసింది.
ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఆక్యూపెన్సీ పడిపోతూ వస్తున్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దేశంలోని పలు రాష్ట్రాలలో పరీక్షల సీజన్ , తదితర కారణాలతో ప్రియదర్శి - నానిల సినిమా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. బుధవారం మార్నింగ్ షోలకు 18.91 శాతం ఆక్యూపెన్సీ, మ్యాట్నీలకు 24.69 శాతం, ఫస్ట్ షోలకు 23.48 శాతం, సెకండ్ షోలకు 27.92 శాతం ఆక్యూపెన్సీ నమోదైంది. వరుసగా మూడో రోజు భారీ డ్రాప్స్‌ను సొంతం చేసుకున్న కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి చిత్రం 6వ రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.2.10 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకుంది. మరి ఈ టఫ్ ఫైట్ మధ్య ప్రియదర్శి ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











