Robinhood Day 5 Collection : చేతులెత్తేసిన నితిన్.. పడిపోయిన రాబిన్‌హుడ్ వసూళ్లు, ఎన్ని కోట్లంటే?
దాదాపు 23 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నితిన్ నేటికీ చెప్పుకోదగ్గ హిట్ తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. ఒక సినిమా హిట్ అయితే నాలుగు సినిమాలు ఫ్లాప్ అన్నట్లుగా అతని కెరీర్ సాగుతోంది. ఇటీవలి కాలంలో మరింత దారుణంగా నితిన్ పరిస్ధితి తయారైంది. చేపట్టిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ వస్తోంది. తన వంతు శాయశక్తులా కృషి చేస్తున్నప్పటికీ అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. తాజాగా వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ నటించిన చిత్రం రాబిన్‌హుడ్.
విడుదలకు ముందు ఎన్నో వివాదాలు, సంచలనాలకు కేంద్రంగా నిలిచిన ఈ సినిమా రంజాన్, ఉగాది పండుగల కానుకగా మార్చి 28న ప్రేక్షకుల ముందుకొచ్చింది. రాబిన్‌హుడ్‌పై ఉన్న అంచనాలకు వస్తున్న కలెక్షన్స్‌కి ఏమాత్రం పొంతన కుదరడం లేదు. మిక్స్‌డ్ టాక్, పెద్ద సినిమాలతో విపరీతమైన పోటీ నేపథ్యంలో ఐదో రోజు నితిన్ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

రాబిన్‌హుడ్‌లో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించారు. వెన్నెల కిషోర్, రాజేంద్రపస్రాద్, దేవదత్త నాగె, టామ్ చాకో, శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజీలు కీలకపాత్రలు పోషించారు. కేతికా శర్మ స్పెషల్ సాంగ్ చేయగా.. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇందులో ఓ గెస్ట్ రోల్ పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ , ప్రమోషనల్ కార్యక్రమాలు కలిపి రాబిన్‌హుడ్ చిత్రానికి రూ.60 కోట్ల బడ్జెట్ అయ్యింది. టీజర్, ట్రైలర్లు, ఇతర ప్రమోషన్ కార్యక్రమాల కారణంగా రాబిన్‌హుడ్‌కు దాదాపు రూ. 30 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
రూ.35 కోట్ల షేర్ , రూ.70 కోట్ల గ్రాస్ టార్గెట్‌గా థియేటర్‌లలో దిగిన నితిన్‌కు తొలి రోజే షాక్ తగిలింది. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఓపెనింగ్స్ అందుకోలేకపోయింది. ఫస్ట్ వీకెండ్‌లో రూ. కేవలం 7 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టగలిగింది. రంజాన్ పండుగను కూడా నితిన్ చిత్రం క్యాష్ చేసుకోలేకపోయింది. నాలుగో రోజైన సోమవారం కేవలం రూ.1.35 కోట్లను మాత్రమే రాబట్టగలిగింది. వీకెండ్, పండుగలు ముగిసిన తర్వాత 5వ రోజైన మంగళవారం రాబిన్‌హుడ్ ఎలాంటి హోల్డ్ చేసిందో చూస్తే:
మంగళవారం ఉదయం ఆటలకు 9.60 శాతం, మ్యాట్నీలకు 15.61 శాతం, ఫస్ట్ షోలకు 13.31 శాతం, సెకండ్ షోలకు 15.66 శాతం చొప్పున ఓవరాల్‌గా 13.55 శాతంతో అత్యంత దారుణమైన ఆక్యూపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 267 షోలు, బెంగళూరులో 169 షోలు, విజయవాడలో 52 షోలు, విశాఖలో 92 షోలు పడ్డాయి. మొత్తంగా 5వ రోజు రాబిన్‌హుడ్ ప్రపంచవ్యాప్తంగా రూ.70 లక్షలు మాత్రమే రాబట్టగలిగినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఆఫ్‌లైన్ టికెట్ సేల్స్‌తో కలిపి ఇది రూ.80 లక్షల వరకు ఉండొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా 5 రోజుల వరకు రాబిన్‌హుడ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.11.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇందులో ఇండియా వైడ్ రూ.9.95 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.1.55 కోట్లు చొప్పున కలెక్షన్స్ వచ్చాయి.
బడ్జెట్ , ప్రీ రిలీజ్ బిజినెస్ గణాంకాలను చూస్తే రాబిన్‌హుడ్ మూవీ ఇంకా దాదాపు 85 శాతం రికవరీని సాధించాల్సి ఉంది. ఎల్ 2 : ఎంపురాన్, వీర ధీర సూర, సికందర్, మ్యాడ్ స్క్వేర్‌ల వంటి చిత్రాల పోటీని తట్టుకుని నితిన్ నిలబడటం కష్టమేనని పరిస్ధితులను బట్టి రాబిన్‌హుడ్ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినట్లేననే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లాంగ్‌రన్‌లో నితిన్ ఎంత రాబడతాడో చూడాలి.


Click it and Unblock the Notifications











