‘ఎన్టీఆర్’ 5 రోజుల కలెక్షన్లు: టాక్ చూస్తే గొప్పగా.. కలెక్షన్లు చూస్తే షాకింగ్‌గా!
స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కథా ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్‌లో మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి వన్‌సైడ్‌గా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రానికి తొలిరోజు కలెక్షన్లు రికార్డుస్థాయిలో వచ్చాయి. కానీ రెండో రోజు నుంచి వసూళ్లు క్రమేపీ క్షీణించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తొలి రోజు కలెక్షన్లు చూసిన వారికి ఈ మూవీ రూ.100 కోట్లు సునాయసంగా దాటేయడం ఖాయమనే మాట వినిపించింది. అయితే అందుకు భిన్నంగా కలెక్షన్లు కనిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

1000 స్క్రీన్లలో ప్రపంచవ్యాప్తంగా
ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది. దాదాపు 1000 స్క్రీన్లలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. యూఎస్‌లోనే 200 సినిమా హాళ్లలో 600 స్క్రీన్లలో ప్రీమియర్ షోలు ఏర్పాటు చేశారు. దాంతో తొలిరోజున ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ బయోపిక్ రూ.21 కోట్లు కలెక్ట్ చేసింది. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా కంటె ఎక్కువగానే సాధించింది.

తొలివారాంతంలో
ఎన్టీఆర్ బయోపిక్‌కు వరుసగా విడుదలైన పేట, వినయ విధేయ రామ, ఎఫ్2 చిత్రాలు దెబ్బేశాయి. దాంతో గత ఐదు రోజుల్లో ఈ చిత్రం రూ.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే వసూలు చేసినట్టు సమాచారం. అయితే బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చేసిన తొలి వారాంతం వసూళ్లు రూ.46.55 కోట్లు దాటడంలో విఫలమైందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

నికర వసూళ్లు 16 కోట్లే
ఇప్పటి వరకు కథానాయకుడు వసూలు చేసిన కలెక్షన్లను చూస్తే గత ఐదు రోజుల్లో సుమారు రూ. 16 కోట్లు ( నికర వసూళ్లను సాధించినట్టు చెబుతున్నారు. ఇంకా భారీగా వసూళ్లను రాబడితేనే గానీ పెట్టిన పెట్టుబడి డిస్టిబ్యూటర్లకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అయితే అధికారికంగా ఎంత వసూలు చేసిందనే క్లారిటీ మాత్రం చిత్ర యూనిట్ నుంచి రావడం లేదు.

70 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్
ఎన్టీఆర్ బయోపిక్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాంలో 13 కోట్లకు, ఆంధ్రా థియేట్రికల్ హక్కులను 41 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ.10 కోట్లు, మిగితా ఏరియాలకు రూ.5.90 కోట్లకు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ రిపోర్టు. ప్రస్తుతం వచ్చిన కలెక్షన్లు చూస్తే ఇంకా భారీగా వసూళ్లను సాధించాల్సి ఉన్నట్టు స్పష్టమవుతున్నది.


Click it and Unblock the Notifications











