ఓవర్సీస్‌లో దేవర డిమాండ్, డిస్ట్రిబ్యూషన్ వాళ్లకే .. కళ్లు చెదిరే బిజినెస్ ఇది
తనకు జనతా గ్యారేజ్ వంటి క్లాస్ హిట్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర. ఆచార్య డిజాస్టర్ తర్వాత తనను తాను నిరూపించుకోవాలని కొరటాల శివ కసిగా ఈ సినిమా చేస్తున్నారు. దేవర ద్వారా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అనిరుధ్ స్వరాలు అందిస్తున్నారు. సెప్టెంబర్ 27న దేవర పార్ట్ -1 ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్, సింగిల్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తన రోల్‌కు సంబంధించిన షూట్‌ను ఎన్టీఆర్ రీసెంట్‌గా పూర్తి చేసుకున్నారు. వచ్చే నెలలో రిలీజ్ ఉండటంతో త్వరగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను కంప్లీట్ చేసి ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేయాలని కొరటాల శివ భావిస్తున్నారు. ఇక రెండ్రోజుల క్రితం
జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా తారక్ ఎడమ చేతి మణికట్టుకు గాయమవ్వడంతో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఎన్టీఆర్ గాయంపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తుండటంతో ఆయన టీమ్ స్వయంగా స్పందించి క్లారిటీ ఇచ్చింది. అలాగే చేతికి కట్టుతో ఉన్న తారక్ ఫోటోలను కూడా రిలీజ్ చేసింది. ఎన్టీఆర్ క్షేమంగానే ఉన్నారని.. విశ్రాంతి అనంతరం తిరిగి సినిమా కార్యక్రమాల్లో పాల్గొంటారని ఎన్టీఆర్ టీమ్ తెలిపింది. మరోవైపు దేవర బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరుగుతున్నట్లుగా ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్ దక్కించుకుని.. తిరిగి ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూటర్స్‌కు ఇస్తున్నారు.
ఆల్రెడీ హిందీ రైట్స్ కూడా రూ.45 కోట్ల వరకు పలికాయని టాక్. ఆర్ఆర్ఆర్‌తో వచ్చిన క్రేజ్.. ఎన్టీఆర్‌కు వరంగా మారి హిందీ బెల్ట్‌లోనూ ఆయనకు ఫాలోయింగ్ వచ్చింది. దీంతో దేవరకు అక్కడా ఫ్యాన్సీ రేటు దక్కినట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ నార్త్ థియేట్రికల్ రైట్స్‌ను దక్కించుకుని ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు కూడా. కన్నడ థియేట్రికల్ రైట్స్‌ను దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తీకేయ, కన్నడ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్‌తో కలిసి కొనుగోలు చేశారు.

ఎన్టీఆర్‌కు ఓవర్సీస్‌లోనూ మంచి మార్కెట్ ఉండటంతో అక్కడి డిస్ట్రిబ్యూషన్ ఎవరు దక్కించుకున్నారన్నది ఆసక్తిగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్‌ను బట్టి.. నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, యూకే , యూరప్‌లలో దేవర డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు బడా సంస్థ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. ఓవర్సీస్ బిజినెస్‌ను రూ.27 కోట్ల డీల్‌తో దేవర నిర్మాతలు క్లోజ్ చేసినట్లుగా ఫలింనగర్ టాక్. అంటే ఆ ఏరియాలో దేవర సేఫ్ జోన్‌లోకి వెళ్లాలంటే ఏకంగా 5.5 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్‌తో ఎన్టీఆర్ రేంజ్ పెరగడం, పైగా కొరటాల శివ డైరెక్టర్ కావడంతో బొమ్మ బాగుంటే టార్గెట్ రీచ్ కావడం పెద్ద విషయం కాదనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











