బాలయ్య కెరీర్లోనే దారుణంగా.. ‘ఎన్టీఆర్-మహానాయకుడు’ క్లోజింగ్ కలెక్షన్స్!
బాలయ్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ 'మహానాయకుడు' బాక్సాఫీసు వద్ద దారుణ పరాజయం పాలైంది. బాలయ్య కెరీర్లో అతిపెద్ద ప్లాప్‌గా ఈ చిత్రం రికార్డులకెక్కింది. ఫిబ్రవరి 22న విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది.
రెండు వారాల థియేట్రికల్ రన్‌లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కనీసం రూ. 5 కోట్ల షేర్ కూడా రాబట్టలేక పోయింది. బాలయ్య కెరీర్లో బాక్సాఫీసు కలెక్షన్ల పరంగా మాయని మచ్చగా ఈ చిత్రం మిగిలిపోయిందనే వాదన ట్రేడ్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

వరల్డ్ వైడ్ టోటల్ షేర్
‘ఎన్టీఆర్-మహానాయకుడు' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు(2 వారాలు) అన్ని ఏరియాలకు కలిపి రూ. 4.7 కోట్ల షేర్ మాత్రమే వసూలైనట్లు తెలుస్తోంది. బాలయ్య లాంటి స్టార్ హీరో సినిమాకు ఇంత తక్కువ మొత్తం వసూలు కావడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

థియేటర్ల నుంచి ఎత్తేస్తున్నారు
‘ఎన్టీఆర్-మహానాయకుడు' కలెక్షన్స్ కొన్ని ఏరియాల్లో థియేటర్ల రెంటు కూడా రాబట్టలేని స్థితిలో ఉందని సమాచారం. మార్చి 8న కొత్త సినిమాలు వస్తున్న నేపథ్యంలో రేపు(మార్చి 7) దాదాపు అన్ని ఏరియాల్లో ఈ చిత్రాన్ని ఎత్తేయబోతున్నారు.

ఫ్రీగా ఇచ్చినా నష్టాలు రికవరీ కాలేదు
సంక్రాంతికి విడుదలైన ‘ఎన్టీఆర్-కథానాయకుడు' సినిమా వల్ల బయ్యర్లు రూ. 50 కోట్లు మేర నష్టపోయారు. ఈ నష్టాలు పూడ్చడానికి ‘ఎన్టీఆర్-మహానాయకుడు' చిత్రాన్ని ఫ్రీగా ఇచ్చేరు. దీని వల్ల వచ్చే రాబడిలో బయ్యర్లకు 40%, నిర్మాతలకు 60% దక్కేలా ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.

తొలి ప్రయత్నంలోనే షాక్
క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా బాలయ్య నిర్మాతగా మారారు. ఎన్.బి.కె ఫిల్మ్స్ సంస్థ స్థాపించిన నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన బాలయ్యకు తొలి అడుగులోనే చేదు అనుభవం ఎదురైంది. ఈ ఫలితం ప్రభావంతో బాలయ్య కొంతకాలం వరకు సినిమా నిర్మాణం జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











