10 కోట్లతో తీస్తే 750 కోట్లు... రికార్డ్ కలెక్షన్స్‌తో చిన్న సినిమా సంచలనం!
బాక్సాఫీస్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో ఊహించడం కష్టం. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు డిజాస్టర్‌గా నిలిచి నష్టాలను మిగిలిస్తే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చే సినిమాలు భారీ లాభాలతో సర్‌ప్రైజ్ చేస్తాయి. ఈ ఏడాది హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన సినిమాలు బొక్కబోర్లాపడగా.. కొత్త నటీనటులు, చిన్న హీరోలతో తెరకెక్కిన సినిమాలు అద్భుతాలు సృష్టించాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇలాంటి సినిమాలు ఎన్నో. తాజాగా ఓ సినిమా 10 కోట్ల రూపాయలతో నిర్మిస్తే ఏకంగా 750 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఆ సినిమా ఏంటీ? ఈ మూవీ ఆ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడానికి కారణాలు ఏంటీ? అనేది పరిశీలిస్తే..
అబ్సెషన్ తారాగణం
ఆ సినిమా ఏదో కాదు.. హాలీవుడ్‌లో తెరకెక్కిన అబ్సెషన్. క్యాప్‌స్టోన్ పిక్చర్స్, టీ షాప్ ప్రొడక్షన్స్, బ్లూమ్‌హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జేమ్స్ హారీస్, హేలీ నికోల్ జాన్సన్, క్రిస్టియన్ మెర్‌క్యూరి, రోమన్ వియారిస్‌లు ఈ సినిమాను నిర్మించగా.. కర్రీ బార్కర్ దర్శకత్వం వహించారు. మైఖేల్ జాన్స్‌టన్, ఇండే నవరాట్టె, కూపర్ టామిల్సన్, మెగన్ లాలెస్, అండీ రిచ్టెర్, డారిన్ టూండర్ తదితరులు అబ్సెషన్ మూవీలో కీలక పాత్రలు పోషించారు. టేలర్ సెలమన్స్ సినిమాటోగ్రాఫీ అందించగా.. కర్రీ బార్కర్ దర్శకత్వంతో పాటు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. రాక్ బార్వెల్ సంగీత దర్శకత్వం వహించారు.

అబ్సెషన్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి ఈ సినిమాను 10 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. సైకో హార్రర్, సూపర్ నేచురల్ పవర్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ఫోకస్ ఫీచర్స్ సంస్థ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ... యూనివర్సల్ పిక్చర్స్ సంస్థ విదేశాల్లోనూ రిలీజ్ చేసింది. టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా గతేడాది సెప్టెంబర్ 5న అబ్సెషన్ మూవీని తొలిసారిగా ప్రదర్శించారు. ఈ ఏడాది మే 15న అమెరికాలో ఈ సినిమాను రిలీజ్ చేశారు.
అబ్సెషన్ కలెక్షన్స్ ఎంత?
ఈజ్ గాడ్ ఈజ్, ఇన్ ది గ్రే వంటి సినిమాలు థియేటర్‌లో ఉన్నప్పటికీ అబ్సెషన్ సత్తా చాటింది. తొలిరోజున 7 మిలియన్ డాలర్లు (66.73 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. తొలివారం అమెరికా, కెనడాలలో కలిపి 17.2 మిలియన్ డాటర్లు (164 కోట్ల రూపాయలు) రాబట్టింది. ఇప్పటి వరకు అమెరికా- కెనడాలలో 61 మిలియన్ డాలర్లు (581 కోట్ల రూపాయలు), విదేశాలలో 21 మిలియన్ డాలర్లు (200 కోట్ల రూపాయలు) చొప్పున 781 కోట్ల రూపాయలు వసూలు చేసి 1000 కోట్ల రూపాయల మార్క్ దిశగా పరుగులు తీస్తోంది అబ్సెషన్.
ఆ రికార్డ్‌పై అబ్సెషన్ కన్ను
ఈ వసూళ్లతో పెట్టుబడిపై ఏకంగా 100 రెట్లు లాభం సాధించింది. ఈ ఏడాది హాలీవుడ్‌లో అత్యంత లాభాలను ఆర్జించిన సినిమాలుగా ఉన్న మైఖేల్, ప్రొజెక్ట్ హెయిల్ మేరీ వంటి సినిమాలు కూడా తమ బడ్జెట్‌పై కేవలం 3 నుంచి 5 రోట్లు మాత్రమే ప్రాఫిట్స్‌ను అందుకోవడం గమనార్హం. కేవలం మౌత్ టాక్‌తోనే సినిమా ఈ స్థాయి ప్రభంజనం సృష్టిస్తోంది. వారాంతాల్లో అబ్సెషన్‌కు భారీ ఆదరణ లభిస్తోంది. ఇదే జోరు కొనసాగితే .. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి 100 మిలియన్ డాలర్లు (954 కోట్ల రూపాయలు) రాబట్టిన మూడో సినిమాగా అబ్సెషన్ నిలిచే అవకాశం ఉంది. దీని కంటే ముందు పారానార్మల్ యాక్టివిటీ, ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్ ఉన్నాయి. కాగా.. బాక్సాఫీస్ వద్ద ఇంతటి సంచలనం సాధించిన అబ్సెషన్.. ఈ నెల 29వ తేదీన భారతదేశంలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇండియాలో ఈ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందోనని ట్రేడ్ పండితులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications


