twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రేడ్‌ టాక్‌: కొత్త రీళ్లలో పాత కథలు

    By Staff
    |

    దీపావళి, రంజాన్‌ పర్వదినాలు పురస్కరించుకుని వచ్చే సెలవులు, సందడి అంతా ఇంతా కాదు. దానిని క్యాష్‌ చేసుకోడానికి తెర మీదకొచ్చాయి పలు తెలుగు చిత్రాలు. వాటిలో ముఖ్యమైనవి - జగపతిబాబు హీరోగా నటించిన సామాన్యుడు, గోపిచంద్‌ హీరోగా నటించిన రారాజు.

    తొలిప్రేమ, గోదావరి వంటి చక్కని చిత్రాలు నిర్మించిన నిర్మాత జి. వి. జి. రాజు నేతృత్వంలో కలిసుందాం..రా.. వంటి సూపర్‌ హిట్‌ చిత్ర దర్శకుడు ఉదయ్‌ శంకర్‌ దర్శకత్వంలో వరుసగా మూడు హిట్‌ చిత్రాలు ఇచ్చిన హీరో (యజ్ఞం, ఆంధ్రుడు, రణం) గోపిచంద్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం అంటేనే చాలా అంచనాలు పెరిగాయి. అయితే, అక్టోబర్‌ 20న విడుదలైన రారాజు చిత్రం అందరి అంచనాలను తల్లకిందలు చేస్తూ నిరాశపర్చింది. మూసపోసిన పాత కథ, అర్థం పర్థం లేని సన్నివేశాలు, అనవసరమైన హీరోయిజం, ఎటూ తేల్చని ముగింపు.. ఈ చిత్రానికి డ్రాబ్యాక్‌ అని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. రౌడీగా రఫ్‌గా సాగే సదరు హీరో పాత్ర, అతడిని యమపిచ్చిగా ప్రేమించేసే ఓ సబ్‌-ఇన్‌స్పెక్టర్‌, ఆమెను కాదనుకుని హీరో వెంపర్లాడే అమ్మాయి పాత్రలో మీరా జాస్మిన్‌ - వీళ్ల మధ్య అల్లిన కథలో అంతా పాత వాసనే తప్ప కొత్తదనపు గుభాళింపు కొంతయినా లేకపోయింది. ఫలితంగా ఈ చిత్రం చివరి వరకూ చూడటం కష్టమే అని థియేటర్‌ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు గట్టిగా నిట్టూర్చి మరీ చెబుతున్నారు.

    ఇక సామాన్యుడు చిత్రం విషయానికొస్తే.. చాలాకాలం తర్వాత కమర్షియల్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన రవి సి. కుమార్‌ (గతంలో రవి చావలి) ఈసారి జర్నలిజం, రాజకీయాలు నేపథ్యంలో ఒక చిత్రానికి కథ నల్లారు. అయితే, ఆయనకు జర్నలిజం మీద గానీ, రాజకీయాల మీద గానీ బొత్తిగా అవగాహన లేనట్టుందని ఈ చిత్రం చూస్తే అర్థం అవుతుంది. ఒక పత్రిక చేతిలో ఉండి రాజకీయ నాయకులను ఎండగొట్టడం అన్నది ఏ నాటి నేపథ్యం? కనీసం ఎలక్ట్రానిక్‌ మీడియాను ఎంచుకున్నా కథకు అంతో ఇంతో కొత్తదనం చేకూరేదేమో.. రామ్‌గోపాల్‌ వర్మ స్ఫూర్తితో షాట్లయితే పెట్టగలరు గానీ పూర్తిగా ఆయనలా తీయడం ఎంత కష్టమో ఇప్పటికి ఆయన శిష్యులు చాలాసార్లు మనకి నిరూపించారు. రవి సి కుమార్‌ కూడా అలాంటి ప్రయత్నమే చేశారనిపిస్తుంది. సామాన్యుడు చిత్రంలో జగపతిబాబు నటన తప్ప మిగిలిన అంశాలలో వెనుకబడుతుందని, ఈ చిత్రం జనాన్ని మెప్పించాలంటే కష్టపడాలని ట్రేడ్‌ వర్గాల భోగట్టా.

    గత వారం విడుదలైన టాటా బిర్లా మధ్యలో లైలా.. చిత్రం అక్కడక్కడ బాగానే వసూళ్లు సాధిస్తోంది. డబ్బింగ్‌ చిత్రమైన పొగరు మంచి ఓపెనింగ్స్‌ సాధించినా.. అది కూడా మూసకథే కావడంతో ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

    మరిన్నికథనాలు

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X