OG Hindi Collection: నార్త్‌లో పవన్ మేనియా.. రికార్డ్ షోలతో ఓజీకి భారీ కలెక్షన్స్, ఎన్ని కోట్లంటే?
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఓజీ. గ్యాంగ్‌స్టర్, అండర్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. భారీ వసూళ్లతో ఇప్పటికే ఈ సినిమా 200 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరి 300 కోట్ల దిశగా దూసుకెళ్తూ.. పవన్ కెరీర్‌లో ఆల్‌టైం రికార్డ్ క్రియేట్ చేయనుంది. ఇకపోతే.. పవన్ కళ్యాణ్‌కు పెద్దగా మార్కెట్ లేని హిందీ బెల్ట్‌లోనూ రోజు రోజుకు కలెక్షన్లు పెంచుకుంటూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ వివరాల్లోకి వెళితే..
ఓజీలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్ర పోషించారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమాన్యు సింగ్, అజయ్ ఘోష్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేశారు.

ఓజీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి ఓజీ సినిమాను దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. ఆంధ్రా రైట్స్ 80 కోట్ల రూపాయలకు, సీడెడ్‌లో 22 కోట్ల రూపాయలు, నైజాం థియేట్రికల్ రైట్స్ 55 కోట్ల రూపాయల మేర అమ్ముడయ్యాయి. దాంతో ఓజీ తెలుగు రాష్ట్రాల్లో 157 కోట్ల రూపాయల (జీఎస్టీతో కలిపి) మేర బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక హక్కులు 8 కోట్ల రూపాయలు.. తమిళ, కేరళలో హక్కులు 3 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది.
ఓజీ బ్రేక్ ఈవెన్ టార్గెట్
ఇక నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ 25.5 కోట్ల రూపాయల మేర అమ్ముడయ్యాయి. పవన్ కళ్యాణ్ చిత్రం యూఎస్‌లో బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 4.5 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా ఓజీ మూవీకి వరల్డ్ వైడ్‌గా 193.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో పవన్ కళ్యాణ్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 200 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్, 400 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
ఓజీ కలెక్షన్స్
పవన్ కళ్యాణ్ మూవీ కలెక్షన్స్ పరిశీలిస్తే.. ఈ సినిమా ఐదు రోజుల వరకు ఇండియాలో 148.82 కోట్ల రూపాయల నెట్.. 176. 12 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఆంధ్రా, నైజాంలలో 148 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 17 కోట్ల రూపాయలు, తమిళనాడులో 3.50 కోట్ల రూపాయలు, కేరళ + హిందీ+ రెస్టాఫ్ ఇండియాలో 5.23 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసింది ఓజీ. ఓవర్సీస్‌లో అయితే ఓజీ ఎదురులేకుండా సాగుతోంది. అమెరికాలో రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 3 మిలియన్ డాలర్లను రాబట్టిన ఓజీ.. ప్రస్తుతం 5 రోజుల వరకు ఒక్క నార్త్ అమెరికాలోనే 5 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 45 కోట్ల రూపాయలు) వసూలు చేసినట్లు ప్రత్యంగీరా సినిమాస్ అధికారికంగా వెల్లడించింది. ఆస్ట్రేలియా, యూకే, యూరప్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్, న్యూజిలాండ్ తదితర దేశాలలో కలిపి మొత్తంగా ఓవర్సీస్‌లో ఓజీకి 86 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. ఓవర్సీస్ వసూళ్లతో కలిపి ఓజీ ఐదు రోజుల వరకు 263 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి 300 కోట్లకు చేరువైంది.
ఓజీ హిందీ కలెక్షన్స్
తెలుగు హీరోల్లోనే తిరుగులేని ఫ్యాన్ బేస్, మార్కెట్ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఇంకా పాన్ ఇండియా హీరో అనిపించుకోలేకపోయారు. దక్షిణాదిలో పవన్ హవా ఉన్నప్పటికీ.. ఉత్తరాదిలో మాత్రం ఆయన జోరు చూపించలేకపోతున్నారు. ఓజీ వరల్డ్ వైడ్‌గా 262 కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తే.. అందులో దాదాపు 150 కోట్లు ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చింది. హిందీలో ఓజీని అంతగా పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. తొలిరోజు 40 లక్షలు, రెండో రోజు కోటి 60 లక్షలు, మూడో రోజు 90 లక్షలు మాత్రమే రాబట్టింది. అయితే గత వీకెండ్ నుంచి పరిస్థితులు మారిపోయాయి. ఓజీకి నార్త్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. శని, ఆదివారాల్లో దాదాపు 2 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించగా.. సోమవారం కూడా బుకింగ్స్ బాగానే జరిగినట్లుగా నివేదికలు చెబుతున్నాయి.
వర్కింగ్ డే అయిన సోమవారం కూడా ఓజీ హిందీ వెర్షన్‌లో దాదాపు 18 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదవ్వగా.. 1000 స్క్రీన్‌లలో దాదాపు 3000 వరకు షోలు పడినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో ఐదో రోజు ఓజీకి హిందీలో 50 లక్షల రూపాయల గ్రాస్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో కలిపి ఐదు రోజుల్లో ఓజీకి హిందీలో 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. రాబోయే రోజుల్లో హిందీలో ఓజీ హవా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











