Pareshan Collections పరేషాన్‌గా కలెక్షన్లు.. రానా దగ్గుబాటి మూవీకి కలెక్షన్లు ఎంతంటే?
తెలంగాణ నేపథ్యంతో చిన్న బడ్జెట్ చిత్రాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు మంచి ఆదరణను సొంతం చేసుకొంటున్నాయి. ప్రేక్షకులు, సినీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేస్తున్నాయి. అలాంటి కోవలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పరేషాన్. రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వంలో సిద్దార్థ్ రాళ్లపల్లి నిర్మాతగా రూపొందిన ఈ చిత్రం జూన్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
టాలెంటెడ్ యాక్టర్ తిరువీర్, పావని కరణం, బన్నీ అభిరాన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, శృతి రియాన్ లాంటి నూతన నటులు నటించిన ఈ చిత్రం పూర్తిగా తెలంగాణ నేటివిటి, భాష, యాసకు పెద్ద పీట వేసింది. అయితే ఈ సినిమా కంటెంట్‌ను చూసి రానా దగ్గుబాటి సమర్పించడంతో మంచి క్రేజ్ ఏర్పడింది. టీజర్, ట్రైలర్లలోని కంటెంట్ ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించేలా చేసింది.

జూన్ 2వ తేదీన మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పరేషాన్ మూవీ మిక్స్‌డ్ టాక్ అందుకొన్నది. ఈ చిత్రం కొన్ని వర్గాలను విశేషంగా ఆకట్టుకొంటే.. మరొకొన్ని వర్గాలను మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమా స్థాయికి మించి ప్రేక్షకుల మన్ననలు అందుకొంటున్నది. దాంతో ఈ సినిమాను ఆదివారం నుంచి 70 స్క్రీన్లు పెంచడం బట్టి దాని క్రేజ్ స్పష్టమవుతున్నది.
పరేషాన్ చిత్రం నూతన నటీనటులు, సాంకేతిక నిపుణులతో నిర్మించడంతో బడ్జెట్ ఓ మోస్తారుగా అయింది. సుమారు 3.5 కోట్ల రూపాయల వ్యయంతో ఈ సినిమాను తెరకెక్కించినట్టు సమాచారం. ఇక ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో సుమారు 200 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. గత మూడు రోజుల్లో 25 నుంచి 30 శాతం ఆక్యుపెన్సీ నమోదు అవుతున్నట్టు తెలిసింది.

పరేషాన్ సినిమా మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఓ మోస్తారుగా నమోదు చేస్తున్నది. తొలి రోజు
23 లక్షల రూపాయలు, రెండో రోజు 32 లక్షల రూపాయలు వసూలు చేసింది. మూడో రోజు ఈ సినిమా 40 లక్షల రూపాయలకుపైగా కలెక్షన్లను రాబట్టింది. ఇక స్క్రీన్లు పెంచడం వల్ల సోమవారం కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
పరేషాన్ సినిమా థియేట్రికల్ వ్యాల్యూను సుమారు 2 కోట్లుగా అంచనా వేశారు. సురేష్ డిస్ట్రిబ్యూషన్ సొంతంగా ఈ సినిమాను రిలీజ్ చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 2 కోట్ల షేర్, 4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా 90 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. రానున్న రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











