Bheemla Nayak Day 6 Collections: భారీగా పడిపోయిన కలెక్షన్లు.. అన్ని కోట్లతో పవన్ మరో రికార్డు!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో వచ్చిన భారీ చిత్రాలు చాలా తక్కువనే చెప్పాలి. దీంతో సినీ ప్రియులు ఫుల్ మీల్స్ దొరికే సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రమే 'భీమ్లా నాయక్'. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కలిసి నటించిన ఈ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసుకుంది. అందుకు అనుగుణంగానే దీనికి ఆరంభం నుంచే భారీగా స్పందన దక్కుతోంది. దీంతో రెండు రోజుల్లోనే యాభై కోట్ల రూపాయల షేర్‌ను కూడా దాటింది. ఆ తర్వాత వసూళ్లు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో 'భీమ్లా నాయక్' ఆరు రోజుల రిపోర్టును మీరూ చూడండి!

భారీ మల్టీస్టారర్‌గా భీమ్లా నాయక్
పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలయికలో రివేంజ్ డ్రామాగా రూపొందిన చిత్రమే 'భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర రూపొందించిన ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు మాటలు ఇచ్చాడు. థమన్ దీనికి సంగీతం సమకూర్చాడు. ఈ భారీ సినిమాలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.

ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఇలా
భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన 'భీమ్లా నాయక్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ. 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా హక్కులు రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 9 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 106.75 కోట్లు బిజినెస్‌ను చేసుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

6వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
'భీమ్లా నాయక్'కు 6వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు తగ్గాయి. దీంతో నైజాంలో రూ. 1.63 కోట్లు, సీడెడ్‌లో రూ. 51 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 53 లక్షలు, ఈస్ట్‌లో రూ. 26 లక్షలు, వెస్ట్‌లో రూ. 10 లక్షలు, గుంటూరులో రూ. 11 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో కలిపి బుధవారం రూ. 3.32 కోట్లు షేర్‌తో పాటు రూ. 5 కోట్లు గ్రాస్ వచ్చింది.

6 రోజులకు కలిపి ఎంత వచ్చింది?
తెలుగు రాష్ట్రాల్లో 'భీమ్లా నాయక్' ఆరు రోజుల్లో బాగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 32.82 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.39 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.79 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.95 కోట్లు, వెస్ట్‌లో రూ. 4.58 కోట్లు, గుంటూరులో రూ. 4.76 కోట్లు, కృష్ణాలో రూ. 3.23 కోట్లు, నెల్లూరులో రూ. 2.30 కోట్లతో కలిపి రూ. 68.82 కోట్లు షేర్, రూ. 104.80 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
6 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో రూ. 68.82 కోట్లు వసూలు చేసి సత్తా చాటిన 'భీమ్లా నాయక్' మూవీ మిగిలిన ప్రాంతాల్లోనూ సత్తాను చాటుకుంది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 7.52 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 11.45 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 6 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 87.79 కోట్లు షేర్‌తో పాటు రూ. 143 కోట్ల గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
భారీ అంచనాల నడుమ విడుదలైన 'భీమ్లా నాయక్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 6 రోజుల్లో రూ. 87.79 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 20.21 కోట్లు వస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

మరో రికార్డును అందుకున్న పవన్
'భీమ్లా నాయక్' మూవీకి ఫస్ట్ వీకెండ్‌లో మంచి కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలుపుకుని వంద కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా వేగంగా ఈ మార్కును అందుకున్న చిత్రాల లిస్టులో చోటు దక్కించుకుంది. దీంతో పవన్ ఖాతాలో మరో రికార్డు చేరింది.


Click it and Unblock the Notifications











