Bheemla Nayak Business: అన్ని కోట్లు వస్తేనే సినిమా హిట్.. ఏ ఏరియాలో ఎంత ధర పలికిందంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో రకాల సినిమాలు రూపొందుతుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే విశేషమైన గుర్తింపును అందుకుంటాయి. తద్వారా విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలాంటి వాటిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో వస్తోన్న 'భీమ్లా నాయక్' ఒకటి. భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Recommended Video
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ మేనియా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు బయటకు వచ్చాయి. అసలు 'భీమ్లా నాయక్' మూవీ ఎంతకు అమ్ముడైంది? ఎంత వస్తే హిట్ అవుతుంది? చూద్దాం పదండి!

క్రేజీ కాంబలో వస్తోన్న భీమ్లా నాయక్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కాంబోలో రూపొందిన భారీ చిత్రమే ‘భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర రూపొందించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. ఇక, ఈ భారీ సినిమాలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేశారు.

మూవీ స్టోరీ.. హీరోల పాత్రలు ఇలాగ
మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియం'కు భీమ్లా నాయక్ రీమేక్‌గా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇగో ఉన్న ఓ పవర్‌ఫుల్ పోలీసు.. లోకల్ డాన్ మధ్య జరిగే ఆధిపత్య పోరుతో ఈ సినిమా రూపొందింది. ఇందులో పోలీస్ పాత్రలో పవన్ కల్యాణ్.. లోకల్ డాన్‌గా దగ్గుబాటి రానా చేశారు. ఇప్పటికే వీళ్లిద్దరి పాత్రలకు సంబంధించిన లుక్స్‌కు అన్ని వర్గాల నుంచి రెస్పాన్స్ వచ్చింది.

విడుదలకు రెడీ.. ఫ్యాన్స్ హంగామా
పవన్ - రానా కాంబోలో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్' మూవీ విడుదలపై చాలా రోజుల పాటు సందిగ్ధత నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఊహించని విధంగా దీన్ని ఫిబ్రవరి 25నే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇక, అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా భీమ్లా నాయక్ ఫీవర్ మొదలైంది. ఈ సినిమా కోసం థియేటర్లను ముస్తాబు చేస్తూ.. ఫ్లెక్సీలు రెడీ చేస్తూ ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు.

భారీ రేంజ్ బిజినెస్... హాట్ కేకుల్లా
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ‘భీమ్లా నాయక్' మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు అయ్యాయని సమాచారం.

ఏపీ తెలంగాణలో బిజినెస్ డీటేల్స్
‘భీమ్లా నాయక్'కు తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 35 కోట్లు, సీడెడ్‌లో రూ. 16.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 9 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 6.40 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 5.40 కోట్లు, గుంటూరులో రూ. 7.20 కోట్లు, కృష్ణాలో రూ. 6 కోట్లు, నెల్లూరులో రూ. 3.25 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఎంత?
తెలుగులోనే భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ‘భీమ్లా నాయక్' మూవీకి దేశ వ్యాప్తంగా కూడా మంచి స్పందన దక్కుతోంది. దీంతో ఈ సినిమా రెస్టాఫ్ ఇండియా హక్కులకు రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులకు రూ. 9 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో పవన్ - రానా కలయికలో వస్తోన్న ‘భీమ్లా నాయక్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర వ్యాపారం జరిగింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంతొస్తే హిట్?
భారీ అంచనాల నడుమ రాబోతున్న ‘భీమ్లా నాయక్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లుగా నమోదైంది. అంటే ఇన్ని కోట్ల రూపాయలు వస్తేనే సినిమా హిట్ అయినట్లు లెక్క. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇది చేరుకోవడం అంత కష్టమేమీ కాదనే చెప్పాలి.

బిజినెస్ పరంగా టాప్ 10లో చోటు
టాలీవుడ్‌లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న చిత్రాల జాబితాలో ‘భీమ్లా నాయక్' ఎనిమిదో స్థానానికి చేరింది. తద్వారా ‘మహర్షి' రికార్డును ఇది బీట్ చేసింది. ఇక, తెలుగులో ఎక్కువ బిజినెస్ జరుపుకున్న చిత్రాల్లో ‘బాహుబలి 2', ‘సాహో', ‘సైరా: నరసింహారెడ్డి', ‘పుష్ప', ‘స్పైడర్', ‘అజ్ఞాతవాసి', ‘బాహుబలి 1' మొదటి ఏడు స్థానాల్లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











