Bheemla Nayak: ప్రపంచ వ్యాప్తంగా పవన్ మేనియా.. భీమ్లా నాయక్ థియేటర్ కౌంట్ ఇదే
కొంత కాలంగా మారుతూ వస్తోన్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరూ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కథ నచ్చితే ఎలాంటి సాహసాన్నైనా చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా మరో హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసేందుకు కూడా ముందుకు వస్తున్నారు. దీంతో ఈ మధ్య ఎన్నో మల్టీస్టారర్ మూవీలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇలా వచ్చిన చాలా చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో.. దర్శక నిర్మాతలు, హీరోలు మరిన్ని సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్‌లో రాబోతున్న భారీ మల్టీస్టారర్ మూవీనే 'భీమ్లా నాయక్'.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన సాగర్ కే చంద్ర తెరకెక్కించిన చిత్రమే 'భీమ్లా నాయక్'. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియం' అనే సినిమాకు ఇది రీమేక్‌గా రూపొందింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఆధిపత్య పోరుతో నడిచే కథతో ఈ సినిమా తెరకెక్కింది. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. అయితే, మధ్యలో కొన్ని అవంతరాలు రావడంతో పలుమార్లు బ్రేక్ వచ్చింది. దీంతో ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాలేదన్న విషయం తెలిసిందే.
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'భీమ్లా నాయక్' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే, అనివార్య కారణాలతో దీన్ని ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే, ప్రతికూల పరిస్థితుల కారణంగా దీన్ని ఆరోజు కూడా విడుదల చేసే అవకాశాలు లేవన్న టాక్ వినిపించింది. కానీ, ఊహించని విధంగా ఫిబ్రవరి 25నే తీసుకు రాబోతున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ హంగమా చేస్తుండడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మేనియా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా ప్రాంతాల్లో భీమ్లా నాయక్ సినిమా సందడి నెలకొంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'భీమ్లా నాయక్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ మూవీని భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. భీమ్లా నాయక్ మూవీ నైజాంలో 375, సీడెడ్‌లో 250, ఆంధ్రాలో 450 వరకూ అంటే మొత్తంగా 1075 నుంచి 1100 థియేటర్లలో విడుదల అవుతోంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 200, ఓవర్సీస్‌లో 600 థియేటర్లలో రాబోతుంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1875 నుంచి 1900 థియేటర్లలో రిలీజ్ అవుతోంది. దీంతో ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది.
'భీమ్లా నాయక్' మూవీని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. దీనికి ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇందులో పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటించారు. రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు కీలక పాత్రలను పోషించారు.


Click it and Unblock the Notifications











