Bheemla Nayak Day 1 Collections తొలి రోజు బాక్సాఫీస్ వద్ద అరాచకం.. పవన్ కల్యాణ్ ఎంత కొల్లగొట్టాడంటే!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ రెస్సాన్స్‌ను కూడగట్టుకొంటున్నది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు, సాధారణ ప్రేక్షకులు పోటెత్తారు. సింగిల్ థియేటర్స్, మల్టీప్లెక్స్, బీ, సీ సెంటర్లనే తేడా లేకుండా సినిమా హాళ్లలో జన జాతర కొనసాగింది. దాంతో బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు నమోదయ్యాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎంతంటే?

ప్రపంచవ్యాప్తంగా 1900 థియేటర్లలో
పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన భీమ్లా నాయక్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నడంతో రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1900 థియేటర్లలో రిలీజ్ చేయడం జరిగింది. దాంతో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. ఉదయం నాలుగు గంటల నుంచే తెలంగాణలో ప్రత్యేక షోలు ప్రదర్శించడం తెలిసిందే.

ఏపీలో థియేటర్లలో ప్రభుత్వం దాడులు
ఇక ఏపీలో ప్రభుత్వ అధికారులు తనిఖీలు, దాడులు చేయడంతో పలు ప్రాంతాల్లో థియేటర్లు మూతపడ్డాయి. అంతేకాకుండా సినిమా టికెట్లు రేట్లు కూడా తగ్గించడంతో ఏపీలో భీమ్లా నాయక్ సినిమాపై భారీ ప్రభావం పడింది. కానీ నైజాంలో మాత్రం భీమ్లా నాయక్ కుమ్మేశాడు. అలాగే ఓవర్సీస్‌లో కూడా భారీగా వసూళ్లు నమోదయ్యాయనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

యూఎస్‌లో మిలియన్ డాలర్ క్లబ్‌లోకి
ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే.. అమెరికాలో భీమ్లా నాయక్ చిత్రం రికార్డులు క్రియేట్ చేసింది. తొలి రోజు ముగియకముందే ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 8 గంటల వరకే ఈ చిత్రం 1,010,001 డాలర్లను వసూలు చేసింది. ఇక యూకేలో ఈ చిత్రం 87 వేల పౌండ్లను వసూలు చేసింది. భారతీయ కరెన్సీలో 88 లక్షలు వసూలు చేసింది. ఐర్లాండ్‌లో 7 లక్షల రూపాయల వరకు రాబట్టింది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో
ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కూడా భీమ్లా నాయక్ దూకుడు అడ్డులేకపోయింది. కోవిడ్ తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా భీమ్లా నాయక్ ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. ఆస్ట్రేలియాలో 42 లక్షలు, న్యూజిలాండ్‌లో సుమారు 7 లక్షల రూపాయల వరకు సొంతం చేసుకొన్నట్టు సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు
ఇక ఆంక్షలు, వివాదాల మధ్య కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీగానే వసూళ్లు నమోదయ్యాయి. నైజాంలో 17 కోట్లకుపైగానే వసూలు చేసే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రా, సీడెడ్‌లో ఈ చిత్రం 10 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉంది. అలాగే కర్ణాటకలో కూడా భారీగా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నది.

తొలి రోజు వసూళ్లు ఎంత ఉండొచ్చంటే..
భీమ్లా నాయక్ ఫైనల్ వసూళ్ల అంచనా ప్రకారం.. తెలుగు రాష్ట్రాలు, అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దుబాయ్, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం 42 నుంచి 45 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











