Pawan Kalyan Top 5 Movies: OG కలెక్షన్లను ఉస్తాద్ భగత్ సింగ్ దాటుతుందా?ఈసారి పవన్ టార్గెట్ ఎన్ని కోట్లంటే?
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఉగాది, రంజాన్ పర్వదినాల కానుకగా మార్చి 19న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన నటించిన మూడో సినిమా ఉస్తాద్ కావడం విశేషం. గబ్బర్ సింగ్ మూవీ తర్వాత హరీశ్ శంకర్- పవన్ కళ్యాణ్ కాంబోలో 14 ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 చిత్రాల వివరాల్లోకి వెళితే..
కాటమరాయుడు
పవన్ కళ్యాణ్ సన్నిహితుడు, ప్రముఖ నిర్మాత శరత్ మరార్ తన నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం కాటమరాయుడు. కిశోర్ కుమార్ పార్ధసాని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించారు. 70 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. సమ్మర్ కానుకగా 2017 మార్చి 24న కాటమరాయుడు చిత్రం విడుదలైంది. ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా 59.20 కోట్ల రూపాయలు షేర్, 97.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

హరిహర వీరమల్లు
ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం, ఏ దయాకర్ రావు నిర్మాతలుగా మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమాకు తొలుత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. అయితే వ్యక్తిగత కారణాలతో క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఏ ఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ మెగాఫోన్ పట్టుకున్నారు. హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లి, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదలైన తొలి మూవీగా హరిహర వీరమల్లు చరిత్రలో నిలిచిపోయింది. దాదాపు 250 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. 2025 జూలై 24న విడుదల హరిహర వీరమల్లుకు వరల్డ్ వైడ్‌గా 121 కోట్ల రూపాయల గ్రాస్.. 74 కోట్ల రూపాయల షేర్ వసూలైంది.
వకీల్ సాబ్
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మాతగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన మూవీ వకీల్ సాబ్. హిందీలో ఘన విజయం సాధించిన కోర్ట్ రూమ్ డ్రామా.. పింక్ సినిమాకు రీమేక్‌గా వకీల్‌సాబ్ మూవీని నిర్మించారు. వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లోనే తొలిసారిగా లాయర్‌గా పవర్‌ఫుల్ రోల్‌లో నటించారు. ఈ సినిమాను సుమారుగా 120 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. వకీల్ సాబ్ మూవీలో పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించారు. ఏప్రిల్ 9, 2021లో రిలీజైన వకీల్ సాబ్ బక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రం తన థియేట్రికల్ రన్ ముగిసేసరికి 137 కోట్ల రూపాయల గ్రాస్, 84 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు రాబట్టింది.
భీమ్లా నాయక్
మలయాళంలో భారీ విజయం సాధించిన అయ్యప్పనమ్ కోషియమ్ సినిమాకు రీమేక్‌గా తెలుగు నేటివిటీకి తగినట్లుగా మార్పులు చేర్పులు చేసి భీమ్లా నాయక్ సినిమాను రూపొందించారు. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించగా.. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించారు. భీమ్లా నాయక్‌ను 75 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఫిబ్రవరి 25వ 2022 సంవత్సరంలో రిలీజైన ఈ చిత్రం అనేక ప్రతికూల పరిస్ధితులను దాటి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని చరిత్ర సృష్టించింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. భీమ్లా నాయక్ మూవీకి సర్కార్ అతి తక్కువ టికెట్ రేట్లు నిర్దేశించింది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమాకు అండగా నిలిచారు. భీమ్లా నాయక్ మూవీ 92 కోట్ల రూపాయల షేర్, 192 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
ఓజీ
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించగా.. పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. ఓజీ మూవీకి 250 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ఇందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా అలరించారు. 2025 సెప్టెంబర్ 25న విడుదలైన ఓజీ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించింది. తొలిరోజున 150 కోట్ల రూపాయలకు పైగా ఓపెనింగ్స్ రాబట్టిన ఓజీ తన థియేట్రికల్ రన్ ముగిసేసరికి వరల్డ్ వైడ్‌గా 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. తద్వారా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఓజీ నిలిచింది.
ఉస్తాద్‌పై భారీ అంచనాలు
ఓజీ 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించిన నేపథ్యంలో భారీ హైప్‌తో వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎన్ని కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తుందోనని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. పవన్, హరీష్ కాంబినేషన్‌కు తోడు.. టీజర్, ట్రైలర్‌లు అంచనాలను మరింత పెంచేశాయి. దీనికి తగినట్లుగానే ఉస్తాద్ భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకొన్నది. దాదాపు 137 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 140 కోట్లకుపైగా షేర్.. 280 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సిన అవసరం ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. భారీ రేంజ్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది.


Click it and Unblock the Notifications



















