Peddi Karnataka Box Office: కన్నడలో పెద్ది కలెక్షన్ల జోరు.. కరుప్పు వసూళ్లు బ్రేక్..
కన్నడ సినీ పరిశ్రమ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభంలో ఉంది. గత కొద్దికాలంగా కన్నడ అగ్రహీరోలు నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టాయి. పలు సినిమాలు షూటింగులు ఆలస్యం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాక్సాఫీస్ వద్ద అలజడి చాలా తక్కువగా కనిపిస్తున్నది. కాంతార సినిమా తర్వాత ఆ స్థాయి సినిమా కన్నడలో రాకపోవడంపై అభిమానులు అందోళన చెందుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ధురంధర్ 1, ధురంధర్ 2, కరుప్పు సినిమాలు కలెక్షన్లు కురిపించి శాండల్‌ఉడ్‌ను కళకళలాడించాయి. ఆ తర్వాత ఇటీవల రిలీజైన పెద్ది చిత్రం కన్నడ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నది. ఈ సినిమా గత 5 రోజులుగా వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే...
పెద్ది సినిమాను కన్నడ సినీ అభిమానులు తమ సినిమాగా భావించడానికి కారణం శివరాజ్ కుమార్. రాంచరణ్‌తో కలిసి ఆయన నటించడం ఈ సినిమాకు అత్యంత బలంగా మారింది. గౌరీనాయుడు పాత్రలో ఆయన ఒదిగిపోవడం, సెకండాఫ్ సినిమా అంతా వారిద్దరి మధ్య నడవడం మూవీకి బలంగా మారింది. శివరాజ్ కుమార్ నటన హుందాగా, స్పూర్తిదాయకంగా ఉండటంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకొన్నారు. ఈ సినిమాను చూసేందుకు సినీ అభిమానులు పొటేత్తారు. దాంతో గత 5 రోజులుగా వసూళ్ల ప్రవాహం కొనసాగింది. ఈ సినిమా కర్ణాటక కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

పెద్ది మూవీ కర్ణాటక థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. ఈ చిత్రానికి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా థియేట్రికల్ హక్కులు ఫ్యాన్పీ రేటుకు దక్కించుకొన్నారు. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ సుమారుగా 17 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారుగా 18 కోట్ల రూపాయల షేర్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
పెద్ది సినిమా గత 5 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 8.85 కోట్ల రూపాయలు, రెండో రోజు 3.5 కోట్లు, మూడో రోజు 4.7 కోట్లు, 4వ రోజు 4.75 కోట్ల రూపాయలు, 5వ రోజు 1.33 కోట్ల రూపాయలు మేర వసూళ్లను సాధించింది. దాంతో ఈ సినిమా సుమారుగా 23 కోట్లకుపైగా రూపాయల వసూళ్లను సాధించింది. ఈ సినిమా 6వ రోజు మరో 1 కోటి రూపాయల వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం దాదాపుగా 60 శాతం మేర రాబడిని రికవరీ చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రానున్న రోజుల్లో ఈ వసూళ్లు పుంజుకొని లాభాల్లోకి ప్రవేశిస్తుందని లెక్కలు వేస్తున్నారు. ఇప్పటి వరకు గత 24 రోజుల్లో కరుప్పు సాధించిన 23 కోట్ల రూపాయల కలెక్షన్లను అధిగమించింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
పెద్ది సినిమా విషయానికి వస్తే.. మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రాంచరణ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం పెద్ది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న చిత్రంలో జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో హిందీ నటుడు దివ్యేందు శర్మ, జగపతి బాబు, ఉపేంద్ర లిమయే, కృతిశెట్టి, జాన్ విజయ్, చమ్మక్ చంద్ర, దయానంద్ రెడ్డి తదితరులు నటించారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కోల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి, ఆంటోని రుబెన్ ఎడిటర్లుగా, దీపాలీ నూర్ క్యాస్టూమ్ డిజైనర్‌గా, స్టంట్ మాస్టర్‌గా సుప్రీం సుందర్ వ్యవహరించారు. ఆర్ట్ విభాగాన్ని డేవిడ్ కుమార్ బపన్నపల్లి పర్యవేక్షిస్తున్నారు. ఈ సినిమా జూన్ 4వ తేదీన రిలీజైన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications