Peddi: పెద్ది యూఎస్ ప్రీమియర్లు ఎప్పుడు? అమెరికాలో రాంచరణ్ మూవీకి టికెట్ రేటు ఎంతంటే?
మెగా పవర్ స్టార్ రాంచరణ్, గ్లామర్ క్వీన్ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం పెద్ది. ఉప్పెన తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న ఈ సినిమాను వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వృద్ది సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ, విజి చంద్రశేఖర్, రజతవ దత్తా, సత్య తదితరులు నటిస్తున్నారు.
క్రికెట్ బ్యాక్ డ్రాప్‌తో పిరియాడిక్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు సినిమాటోగ్రఫి: ఆర్ రత్నవేలు, ఎఢిటింగ్: నవీన్ నూలీ, మ్యూజిక్: ఏఆర్ రెహ్మాన్ తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ చిత్రం జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నదని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రం ప్రీమియర్లు జూన్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఉంటాయని తెలిపారు.

పెద్ది సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హిందీలో జియో స్టూడియోస్ రిలీజ్ చేస్తున్నారు. ఉత్తర భారతంలో రికార్డు స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతల్లో ఒకరైన దర్శకుడు సుకుమార్ ఇటీవల అధికారికంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాను నార్త్ అమెరికాలో కూడా అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ట్రేడ్ అనలిస్టులు తెలిపారు.
పెద్ది చిత్రాన్ని నార్త్ అమెరికాలో అంటే.. ముఖ్యంగా అమెరికాలో భారీగా షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా తొలి ప్రీమియర్ భారతీయ కాలమానం ప్రకారం జూన్ మూడో తేది 8 గంటలకు ప్రారంభమవుతుంది. 10.30 గంటలకు (EST) అమెరికాలో ప్రీమియర్లు ప్రదర్శించేందుకు రెడీ చేస్తున్నారు అని తెలిపారు.
ఇక ఈ సినిమా టికెట్ రేట్లు ఇలా ఉండబోతున్నాయని ట్రేడ్ అనలిస్ట్ వెంకీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. ప్రీమియర్ల విషయానికి వస్తే.. ఐమాక్స్ వెర్షన్ టికెట్ ఖరీదు 35 డాలర్లు (భారతీయ కరెన్సీలో 3320 రూపాయలు), XD, ఇతర PLF స్క్రీనింగ్ టికెట్ ఖరీదు 30 డాలర్లు (భారతీయ కరెన్సీలో 2850 రూపాయలు), ఇతర వెర్షన్ 25 డాలర్లు (భారతీయ కరెన్సీలో 2400 రూపాయలు) అని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications