Peddi Overseas Box Office Collections: పెద్ది ఓవర్సీస్ బాక్సాఫీస్ కలెక్షన్లు.. రాంచరణ్ మూవీ పరిస్థితి ఏంటి?
వివాదాలు, ట్రోలింగ్ ఒకవైపు.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో పెద్ది చిత్రం రెండో వారంలోకి ప్రవేశించడానికి సిద్దమైంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం తెలుగు, కన్నడ రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఓ మోస్తారు వసూళ్లతో ముందుకెళ్తున్నది. ఈ చిత్రం నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో ఆరంభంలో మంచి వసూళ్లు సాధించినప్పటికీ.. ఆ ట్రెండ్‌ను కొనసాగించలేకపోయిందనే విషయం తాజా కలెక్షన్లతో స్పష్టమైంది. పెద్ది చిత్రం అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియాలో ఎంత వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..
స్పోర్ట్స్, ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన పెద్ది సినిమాను ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించడంతో సుమారుగా 350 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని దర్శకుడు బుచ్చిబాబు సనా అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమాపై ఉన్న అంచనాలకు తగినట్టుగా ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ చిత్రం ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ దాదాపు 34 కోట్ల రూపాయల మేర జరిగిందనే ప్రచారం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమైంది. దాంతో ఈ చిత్రం సుమారుగా 35 కోట్ల రూపాయల షేర్ (అటు ఇటుగా 4 మిలియన్ డాలర్లు), 70 కోట్ల గ్రాస్ (8 మిలియన్ డాలర్లు) కలెక్షన్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

గత 6 రోజుల్లో పెద్ది సినిమా 3.1 మిలియన్ డాలర్లు అమెరికా, కెనడాలో వసూలు చేసింది అని ఈ సినిమాను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రత్యాంగీరా సినిమాస్ వెల్లడించింది. 7వ రోజు ఈ చిత్రం 50 వేల డాలర్లు వసూలు చేసింది అని ట్రేడ్ అనలిస్టు వెంకీ బాక్సాఫీస్ తెలిపారు. దాంతో నార్త్ అమెరికాలో ఈ చిత్రం 3.2 మిలియన్ డాలర్లకు చేరువైంది. భారతీయ కరెన్సీలో 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది అని ప్రత్యాంగీరా వెల్లడించింది.
అమెరికేతర దేశాల్లో ఈ చిత్రం రెండో వారంలోకి మంచి థియేటర్ల సంఖ్యతో అడుగుపెట్టింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజి దేశాల్లో కలిపి ఈ చిత్రం తొలి వారం 500K ఆస్ట్రేలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే భారతీయ కరెన్సీనీలో 3.35 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ప్రత్యాంగీరా ఓవర్సీస్ తెలిపింది. ఇక యూకే, ఐర్లాండ్ విషయానికి వస్తే.. తొలి వారం 325000 మిలియన్ పౌండ్స్ వసూలు చేయడమే కాకుండా రెండో వారంలోకి ఘనంగా అడుగుపెట్టబోతుందని తెలిపింది.
అలాగే గల్ఫ్ కంట్రీస్ విషయానికి వస్తే.. పెద్ది మూవీ ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం 3 రోజుల్లోనే 574215 డాలర్లు వసూలు చేసింది. అంటే భారతీయ కరెన్సీలో 5.49 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ప్రత్యాంగీరా ఓవర్సీస్ అధికారికంగా వెల్లడించింది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో కలిపి ఈ చిత్రం సుమారుగా 40 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను సాధించింది అనే విషయం స్పష్టమైంది.
అయితే ఈ దేశాలే కాకుండా మరికొన్ని దేశాల్లో ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. దాంతో ఓవర్సీస్‌లో ఈ చిత్రం ఇప్పటి వరకు 50 కోట్ల రూపాయల గ్రాస్ మేర కలెక్షన్లు సాధించింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే.. భారీగానే వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండో వారంలో ఈ చిత్రం నష్టాలను తగ్గించుకొని లాభాల్లోకి ప్రవేశిస్తుందా? అనేది వేచి చూడాల్సిందే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.


Click it and Unblock the Notifications