Salaar Re Release 2 days Collections: సలార్ రీ రిలీజ్‌కు భారీ కలెక్షన్లు.. ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్లంటే?
కేజీఎఫ్ సిరీస్‌తో కన్నడ సినిమా రేంజ్ పెంచారు ప్రశాంత్ నీల్. సౌత్‌లో చిన్న ఇండస్ట్రీగా తక్కువ బడ్జెట్‌తో సినిమాలు చేస్తూ వచ్చిన కన్నడ ఇండస్ట్రీలో ఇప్పుడు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయంటే దానికి కారణం ప్రశాంత్ నీలే. ఆయన వేసిన బాటలో కన్నడ చిత్ర పరిశ్రమ రూపు రేఖలే మారిపోయాయి. స్టోరీని, ఎమోషన్స్‌ని, ఎలివేషన్స్‌ని పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తూ ప్రశాంత్ నీల్ సెల్యూలాయిడ్‌పై బ్లాక్ బస్టర్లు తీస్తున్నాడు. ఎంట్రీ సీన్ , ఇంటర్వెల్, క్లైమాక్స్‌లలో ఏ డైరెక్టర్ అయినా ఎలివేషన్స్ ఇస్తారు. కానీ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలివేషన్స్ ఇవ్వడమంటే మామూలు విషయం కాదు. ఇందులో ప్రశాంత్ నీల్ పీహెచ్‌డీ చేసేశాడు.
ఇక వరుస పాన్ ఇండియా సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా అవతారమెత్తాడు ప్రభాస్. ప్రజంట్ ఇండిలో ఏ హీరోకి లేనంత మార్కెట్ ప్రభాస్‌కు ఉంది. ఆయన ఫ్లాప్ చిత్రం కూడా దాదాపు రూ. వందల కోట్ల బిజినెస్ చేస్తుందంటే అతిశయోక్తి కాదు. మాస్ ఇమేజ్‌తో కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటు తన పేరిట ఏకంగా రెండు రూ.1000 కోట్ల సినిమాలు ఉన్నాయి. బాహుబలి 2, కల్కి 2898 ఏడీ చిత్రాలతో ప్రభాస్ దుమ్మురేపాడు . అలాంటి ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన హై వోల్టేజ్ యాక్షన్ చిత్రమే సలార్.

కేజీఎఫ్, కాంతార లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన హోంబలే ఫిల్మ్స్ అధినేతలు విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు సలార్‌ను దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్ సరసన శృతీ హాసన్ నటించగా.. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, బాబీ సింహా, ఈశ్వరి రావు, శ్రీయా రెడ్డి, టిను ఆనంద్, దేవరాజ్, బ్రహ్మాజీ, రామచంద్ర రాజు, కల్పలతలు కీలకపాత్రలు పోషించారు. పోస్టర్లతో భారీ అంచనాలను అందుకున్న సలార్.. ట్రైలర్‌తో సరికొత్త రికార్డులను నమోదు చేసింది.
డిసెంబర్ 1 , 2023న రిలీజైన ఈ సినిమా ట్రైలర్ అన్ని భాషల్లోనూ కలిపి కేవలం 18 గంటల్లోనే ఏకంగా 100 మిలియన్ల వ్యూస్‌ను అందుకుంది. అప్పటి వరకు సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ అత్యధిక వ్యూస్ సాధించింది. ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లో 26.77 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. కానీ సలార్ మాత్రం కేవలం 18 గంటల్లోనే 100 మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడం విశేషం. సలార్ తెలుగు ట్రైలర్ 24 గంటల్లో 30 మిలియన్ల వ్యూస్, హిందీ ట్రైలర్ 54 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.
ప్రశాంత్ నీల్ టేకింగ్ , ప్రభాస్ క్రేజ్‌కు తోడు ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ నేపథ్యంలో సలార్‌కు రికార్డు స్థాయిలో 350 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఆంధ్రా, నైజాంలలో 144 కోట్ల రూపాయలు.. తమిళనాడు థియేట్రికల్ హక్కులను 12 కోట్లకు, కర్ణాటక హక్కులు 30 కోట్లు, కేరళలో 6 కోట్ల రూపాయలు, హిందీ, ఇతర రాష్ట్రాల హక్కులు 82 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 75 కోట్ల మేర అమ్ముడు పోయాయి. భారీ అంచనాల మధ్య క్రిస్మస్ కానుకగా 2023 డిసెంబర్ 22వ తేదీన సలార్: పార్ట్ 1 సీజ్‌ఫైర్ గ్రాండ్‌గా విడుదలైంది.
తొలి రోజు సలార్ ఏకంగా రూ.160 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ. 624.4 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. తొలిసారి రిలీజైనప్పటి కంటే ఇంకా ఎక్కువగా కలెక్షన్స్ రాబడుతున్నారు స్టార్స్. దీనిలో భాగంగా సలార్ పార్ట్ 1ను మార్చి 21వ తేదీన రీ రిలీజ్ చేయగా.. కలెక్షన్ల మోత మోగుతోంది. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రూ.1.46 కోట్ల గ్రాస్ అందుకున్న సలార్.. మొత్తంగా రీ రిలీజ్‌లో ఫస్ట్ డే రూ.3.24 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ రాబట్టింది.
ఇక సలార్ రీ రిలీజ్ రెండో రోజు వసూళ్ల విషయానికి వస్తే.. రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.76.63 లక్షలను రాబట్టాడు ప్రభాస్. ఒక్క ఆంధ్రా, తెలంగాణ నుంచే రెండో రోజు రూ.60 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. మొత్తంగా సలార్ రీ రిలీజ్‌లో రెండు రోజులకు కలిపి రూ.4 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి కనివినీ ఎరుగని రికార్డులను సొంతం చేసింది. మరి రీ రిలీజ్‌లో సలార్ ఎన్ని కోట్ల వద్ద తన పరుగు ముగిస్తుందో చూడాలి.
ఇంతటి విధ్వంసం సృష్టించిన సలార్‌కు పార్ట్ 2 ఎప్పుడొస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే సలార్ 2 షూటింగ్ మొదలైనట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తర్వాత అది నిజం కాదని గాలివార్తగా తేలిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. రాజా సాబ్, ఫౌజీ, కల్కి 2, స్పిరిట్ సినిమాలను త్వరగా కంప్లీట్ చేయాలనే పట్టుదలతో ప్రభాస్ ఉన్నారు. వీటిలో రాజా సాబ్ షూటింగ్ ఆల్‌మోస్ట్ కంప్లీట్ కావొచ్చింది.
మిగిలిన మూడు చిత్రాల షూటింగ్ పూర్తయి అవి రిలీజ్ కావడానికి ఎలా లేదన్నా మూడేళ్ల సమయం పడుతుంది. దీనికి తోడు ప్రభాస్ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఫిలింనగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకుంటే 2029 నాటికి సలార్ 2 సెట్స్ మీదకి వెళ్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చేతిలోనూ పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌తో డ్రాగన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. ఒకవేళ ఏమైనా ఆలస్యం జరిగినా 2026 సమ్మర్‌కి థియేటర్‌లలో దించాలని పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. భారీ స్టార్ క్యాస్టింగ్, హై బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ డ్రాగన్‌ను నిర్మిస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే టాలీవుడ్ నుంచి తొలి పాన్ వరల్డ్ మూవీగా డ్రాగన్ నిలిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి - సూపర్‌స్టార్ మహేశ్ బాబుల ఎస్ఎస్ఎంబీ 29 తెలుగు నుంచి తొలి పాన్ వరల్డ్ మూవీగా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా దాదాపు మూడేళ్ల వరకు రిలీజయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఆ రికార్డును తన పేరిట లిఖించుకోవాలని డ్రాగన్ ఉవ్విళ్లూరుతోంది.


Click it and Unblock the Notifications











