Salaar: భారత సినీ చరిత్రలో ప్రభాస్ రికార్డు.. 1409 కోట్లతో ఎవరికీ సాధ్యం కాని ఘనత
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఈ పేరు దాదాపు ఆరేడేళ్లుగా ఇండియా వ్యాప్తంగా సెన్సేషన్ అవుతోన్న విషయం తెలిసిందే. అంతలా అతడు తనదైన భారీ బడ్జెట్ సినిమాలతో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తున్నాడు. ఫలితంగా తన రేంజ్‌ను మరింతగా పెంచుకుంటూ ముందుకు సాగుతోన్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ఈ స్టార్ హీరో 'సలార్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ ఈ సినిమాతో మరో సంచలన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!
సలార్‌గా రాబోతున్న ప్రభాస్:ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న మూవీనే 'సలార్'. దీన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇచ్చాడు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావు కీలక పాత్రలను పోషించారు.

ఫుల్ హైప్.. బిజినెస్ భారీగా:'సలార్: సీజ్‌ఫైర్' మూవీపై అంచనాలు భారీ స్థాయాలో నెలకొన్నాయి. దీనిపై ఏర్పడ్డ హైప్ వల్ల థియేట్రికల్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 120 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు, మిగిలిన వెర్షన్లను కలుపుకుని రూ. 345 కోట్లు వ్యాపారం అయింది.
బాహుబలి 2కు రికార్డులతో:'బాహుబలి 1' హిట్ అవడంతో 'బాహుబలి 2' మూవీపై వరల్డ్ వైడ్‌గా హైప్ భారీ స్థాయిలో క్రియేట్ అయింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కుల కోసం పోటీ రెట్టింపు అయిపోయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు, భాషలను కలుపుకుని ఈ ప్రతిష్టాత్మక చిత్రం రూ. 352 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుని రికార్డు సాధించింది.

సాహోకు కూడా అలాగే:'బాహుబలి 2'తో స్థాయిని పెంచుకున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. దీంతో అప్పుడు అతడు నటించిన 'సాహో' సినిమా లెవెల్ కూడా భారీగా పెరిగింది. ఫలితంగా ఈ మూవీకి తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 270 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ చేసుకుని హిందీ మార్కెట్‌ను షేక్ చేసింది.
రాధే శ్యామ్‌కు తగ్గిందిగా:'సాహో' మూవీ ఎన్నో అంచనాలతో వచ్చినా తెలుగులో అంతగా ఆడలేదు. దీంతో ఆ తర్వాత ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' మూవీకి కాస్త డిమాండ్ తగ్గిపోయిందనే చెప్పాలి. కానీ, వేరే భాషల్లో మంచి హైప్ క్రియేట్ అయింది. ఫలితంగా ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా అన్ని ప్రాంతాలను కలుపుకుని రూ. 202.80 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌ను మాత్రమే చేసుకుంది.

ఆదిపురుష్ మూవీకి అలా:'బాహుబలి 2' తర్వాత వరుసగా ఫ్లాపులు వస్తున్నా ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' చిత్రానికి మాత్రం భారీ హైప్ క్రియేట్ అయింది. ఫలితంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఇలా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు, భాషలను కలుపుకుని రూ. 240 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుని సత్తా చాటుకుంది.
1409 కోట్లతో సంచలనం:'సలార్' మూవీకి కూడా రూ. 345 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన గత ఐదు చిత్రాలకు కలిపి ఏకంగా రూ. 1409.80 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తద్వారా భారత సినీ చరిత్రలోనే ఇంత మొత్తంలో బిజినెస్ చేసిన ఏకైక ఇండియన్ హీరోగా ప్రభాస్ సంచలన రికార్డును నమోదు చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications











