కోటి పెడితే వారంలో ఏడు కోట్లు వచ్చాయి
హైదరాబాద్: వర్తమాన రాజకీయాల్ని ప్రశ్నించే ప్రజా 'ప్రతినిధి'గా నారా రోహిత్ వారం క్రిందట ప్రేక్షకులముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ మండవ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి జె.సాంబశివరావు నిర్మాత. డైలాగులు హైలెట్ గా ఉన్న ఈ చిత్రం హీరో రెమ్యునేషన్ మినహా దాదాపు కోటి రూపాయల బడ్జెట్ తో రూపొందిందని తెలుస్తోంది. ఈ చిత్రం వారంలో ఏడు కోట్లు వరకూ కలెక్టు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఎలక్షన్ సీజన్ సినిమాకు బాగా కలిసి వచ్చిందని అంటున్నారు. ఊహించని విధంగా ఈ చిత్రం మనీ స్పిన్నర్ గా మారటం అందరినీ అశ్చర్యపరిచింది. రిలీజ్ రోజు రెండు కోట్లు గ్రాస్ సంపాదించిన ఈ చిత్రం వారాంతానికి మరో ఐదు కోట్లు కలెక్టు చేసి మొత్తం ఏడు కోట్లు తో టాప్ ప్లేస్ లో నిలిచింది.
దర్శకుడు ప్రశాంత్ మండవ మాట్లాడుతూ... ''మంచి చెబితే ప్రేక్షకుడు స్వీకరించడు అన్నది అపోహ మాత్రమే. ఏదైనా సరే... వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. రోజూ చూసిన విషయాలే అయినా... మేం మరోసారి కొత్తగా గుర్తు చేద్దామనుకొన్నాం. ఆలోచన రేకెత్తించాలనుకొన్నాం. ఆ ప్రయత్నం ఫలితాన్నిచ్చింది'' అన్నారు .

అలాగే...''సగటు పౌరుడి ఆవేదనకి అద్దం పట్టే కథ ఇది. మనిషికి మనిషి సాయపడాలి అన్న ఓ చిన్న సందేశంతో చిత్రాన్ని తీర్చిదిద్దాం. సందేశాలు చెబితే ప్రేక్షకులు వినే పరిస్థితి లేదన్న మాట తరచుగా వినిపిస్తుంటుంది. కానీ మేం ఆ విషయం గురించి భయపడలేదు. కథలో కొత్తదనం ఉంది. ఆలోచింపజేసే సత్తా ఉంది. అందుకే ధైర్యంగా ముందుకెళ్లాం. సినిమా థియేటర్ నుంచి బయటికొచ్చాక కూడా ప్రేక్షకులు కథ, కథనాల గురించి మాట్లాడుకొంటున్నారు. అక్కడే మేం విజయం సాధించాం. '' అన్నారు.
ఇక ''నాకున్న పరిధిలో కేవలం 29 రోజుల్లోనే ఈ సినిమాను పూర్తి చేశా. దర్శకుడిగా తొలి చిత్రమే చక్కటి సంతృప్తినిచ్చింది'' అన్నారు. తదుపరి కూడా సామాజికాంశాలతో కూడిన సినిమానే చేయబోతున్నానని తెలిపారు. అందరిలాగే నేను కూడా మొదట ప్రేమకథనే తీయాలనుకొన్నాను. కానీ ఆనంద్ రవి చెప్పిన ఈ కథ నాకు బాగా నచ్చింది. ఇలాంటి కథల్ని తెరపైకి తీసుకెళ్లడం ఒక సవాల్‌గా భావించి పనిచేశాను. తొలి చిత్రంతోనే ఎంతో అనుభవాన్ని సంపాదించాను'' అన్నారు.


Click it and Unblock the Notifications











