Pushpa 2 Day 11 collection : 1300 కోట్లు ఫినిష్ .. ఏ హీరోని వదిలేదే లే , కసితీరా కొడుతున్న అల్లు అర్జున్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ భారతీయ చిత్ర పరిశ్రమలో కొత్త రికార్డులు సృష్టిస్తూ దుమ్మురేపుతోంది. నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా రికార్డుల దుమ్ముదులుపుతున్న బన్నీ.. సెకండ్ వీక్‌లోనూ అదే స్థాయిలో తన ప్రభంజనం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో 11వ రోజు పుష్ప 2 ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్, పాటలకు తోడు అల్లు అర్జున్ లుక్, గెటప్‌తో భారీ బజ్ నెలకొంది.

ఈ హైప్ కారణంగా పుష్ప 2కి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. భారతీయ సినీ చరిత్రలోనే ఏ హీరోకి, ఏ సినిమాకు జరగని విధంగా రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ట్రేడ్ పండితులనే ఆశ్చర్యపరిచాడు అల్లు అర్జున్. రూ.1200 కోట్ల గ్రాస్, రూ. 620 కోట్ల షేర్ టార్గెట్‌గా బరిలోకి దిగిన పుష్ప 2 తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను రాబట్టి ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలైన స్త్రీ 2, కల్కి 2898 ఏడీనిలను పుష్ప2 అధిగమించి సరికొత్త రికార్డులు నెలకొల్పింది.
ఇక 11వ రోజు ఆదివారం కావడంతో బుకింగ్స్ అదిరిపోయాయి. పలు ప్రాంతాల్లో టికెట్ ధరలు తగ్గడం కూడా పుష్ప2కి కలిసొచ్చింది. 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 17 కోట్లు, హిందీలో రూ. 57 కోట్లు, తమిళనాడులో రూ.4 కోట్లు, కర్ణాటక, కేరళ + రెస్ట్ ఆఫ్ ఇండియాలలో కలిపి రూ. 3 కోట్లు , ఓవర్సీస్‌లో రూ. 10 కోట్ల చొప్పున మొత్తంగా వరల్డ్ వైడ్‌గా రూ. 92 కోట్ల వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. మొత్తంగా 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 1290 కోట్లు రాబట్టింది.

మిగిలిన ఇండస్ట్రీల సంగతి ఏమో కానీ హిందీలో మాత్రం పుష్ప 2 ప్రభంజనం సృష్టిస్తోంది. హిందీలో నెట్ కలెక్షన్లే రూ.550 కోట్ల మార్క్‌ను క్రాస్ చేయగా.. గ్రాస్ రూ.600 కోట్ల పైమాటే అంటున్నారు ట్రేడ్ పండితులు. అంతేకాదు కొండంత బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయిన రూ.620 కోట్లను కేవలం 11 రోజుల్లోనే అందుకుని భారతీయ సినీ చరిత్రలోనే ఆ స్థాయి బిజినెస్, రికవరీని అందుకున్న తొలి చిత్రంగా పుష్ప 2 నిలిచింది. మరి లాంగ్ రన్‌లో అల్లు అర్జున్ మూవీ ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











