Pushpa 2 Day 12 collection : అల్లు అర్జున్ ఊచకోత , బాహుబలి 2 కోట బద్ధలు.. 12వ రోజు ఎన్ని కోట్లంటే?
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ బాక్సాఫీస్ వద్ద కనివినీ ఎరుగుని రికార్డులను నెలకొల్పుతోంది. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలను ఒక్కొక్కటిగా క్రాస్ చేస్తూ అల్లు అర్జున్ జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది కలెక్షన్ల రికార్డులను నెలకొల్పిన స్త్రీ 2, కల్కి 2898 ఏడీ వంటి భారీ చిత్రాలను అధిగమించింది. ఈ నేపథ్యంలో 12వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల వసూళ్లు సాధించిందో చూస్తే .
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. పుష్ప పార్ట్ 1 బ్లాక్ బస్టర్ కావడంతోపాటు రీసెంట్‌గా వచ్చిన టీజర్, ట్రైలర్, పాటలతో యావత్ భారతదేశం పుష్ప 2 కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసింది.

ఈ హైప్ కారణంగా పుష్ప 2 ది రూల్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. భారతీయ సినీ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సరికొత్త బెంచ్ మార్క్‌లను సెట్ చేశాడు అల్లు అర్జున్. రూ.1200 కోట్ల గ్రాస్, రూ. 620 కోట్ల షేర్ టార్గెట్‌గా బరిలోకి దిగిన పుష్ప 2 తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను రాబట్టి ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది.
సెకండ్ వీక్‌లోనూ ఏ మాత్రం తగ్గని విధంగా దూసుకెళ్తున్నాడు అల్లు అర్జున్. టికెట్ రేట్లను కూడా మేకర్స్ తగ్గించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ , ముఖ్యంగా పిల్లల తాకిడి థియేటర్స్‌కి బాగా పెరిగిందని చెబుతున్నారు. మిగిలిన ఏరియాల సంగతి ఏమో కానీ హిందీ బెల్ట్‌లో పుష్ప రాజ్ ప్రభంజనం సృష్టిస్తున్నాడు. ఈ సినిమాలోని పాటలు, మాటలు, అల్లు అర్జున్ మేనరిజమ్‌తో నార్త్ ఆడియన్స్ పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. ఇప్పటికే హిందీలో రూ. 700 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు సాధించి కనివినీ ఎరుగుని రేంజ్‌లో రికార్డులు నెలకొల్పింది పుష్ప 2.

ఇక 12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.32 కోట్లు, హిందీలో రూ. 22 కోట్లు, తమిళనాడులో రూ.1.15 కోట్లు, కర్ణాటక, కేరళ + రెస్ట్ ఆఫ్ ఇండియాలలో కలిపి రూ. 1.45 కోట్లు , ఓవర్సీస్‌లో రూ. 3 కోట్ల చొప్పున మొత్తంగా వరల్డ్ వైడ్‌గా రూ. 36 కోట్ల వసూళ్లను సాధించింది. మొత్తంగా 12 రోజుల్లో పుష్ప 2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1330 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యంత వేగంగా రూ. 1300 కోట్ల మార్క్‌ను అందుకున్న సినిమాగా నిలిచింది. 2017లో వచ్చిన ఎస్ఎస్ రాజమౌళి ఎపిక్ వండర్ బాహుబలి 2కి ఈ ఫీట్ సాధించడానికి 16 రోజులు పట్టగా.. పుష్ప 2 కేవలం 11 రోజుల్లోనే ఈ మార్క్ చేరుకుంది. దీంతో లాంగ్ రన్‌లో అల్లు అర్జున్ మూవీ ఎన్ని కోట్లు సాధిస్తుందోనని ఇండస్ట్రీ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.


Click it and Unblock the Notifications











