Pushpa 2 Day 14 collection : 1400 కోట్లతో అల్లు అర్జున్ సంచలనం.. RRR గల్లంతు, టాప్ 3లోకి పుష్ప 2
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న విడుదలై అప్పుడే రెండు వారాలు పూర్తి చేసుకుంది. రెండు వారాలు గడుస్తున్నా బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ ప్రభంజనం ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే రూ.1400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన పుష్ప 2 టాలీవుడ్ టూ బాలీవుడ్ అన్ని రికార్డులను తిరగరాస్తోంది. మరి 14వ రోజు పుష్ప 2 ది రూల్ ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టిందో చూస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. పుష్ప 1 సంచలన విజయం నేపథ్యంలో సహజంగా సీక్వెల్‌పై భారీ హైప్ నెలకొంది. దీనికి తోడు టీజర్, ట్రైలర్లు బయటికి వచ్చిన తర్వాత పుష్ప 2పై క్రేజ్ ఓ రేంజ్‌కి చేరుకుంది.

ఈ హైప్ కారణంగా పుష్ప 2 ది రూల్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలో గతంలో ఏ సినిమాకు, ఏ హీరోకు సాధ్యం కాని విధంగా రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది పుష్ప 2. తద్వారా రూ.1200 కోట్ల గ్రాస్, రూ. 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. భారీ అంచనాలతో ఏకంగా 11 వేల థియేటర్లతో బరిలోకి దిగిన పుష్ప 2 తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను రాబట్టి ట్రేడ్ వర్గాల అంచనాలను నిజం చేసింది.
సెకండ్ వీక్ నాటికి చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్‌ను అందుకున్న పుష్ప 2 ది రూల్ పలు బడా సినిమాల రికార్డులను తిరగరాస్తున్నాడు. హిందీలో బాలీవుడ్ బాద్ షా నటించిన జవాన్ టోటల్ కలెక్షన్ల రికార్డును బద్ధలుకొట్టిన అల్లు అర్జున్.. రేపో మాపో శ్రద్ధా కపూర్ స్త్రీ 2 వసూళ్లను అధిగమిస్తాడని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక 14వ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ మంచి బుకింగ్స్ సాధించింది పుష్ప 2 ది రూల్. అయితే గత 13 రోజులుగా హిందీలో రోజుకు రూ.20 కోట్లు తగ్గకుండా నెట్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా బుధవారం మాత్రం తొలిసారి 20 కోట్ల లోపే సర్దుకోవాల్సి వచ్చింది.

ఇకపోతే తెలుగులో రూ.4.02 కోట్లు, హిందీలో 17.26కోట్లు, తమిళ్‌లో రూ.1.13 కోట్లు, కేరళ, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలలో రూ.63 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. కోటి చొప్పున మొత్తంగా 14వ రోజు వరల్డ్ వైడ్‌గా పుష్ప 2 ది రూల్ రూ.24 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీనితో 14 రోజుల వరకు రూ.1400 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది ఈ సినిమా. అలాగే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ వసూళ్లను అధిగమించిన పుష్ప 2.. అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రాల లిస్ట్‌లో మూడో స్థానంలో నిలిచింది. దంగల్, బాహుబలి 2లు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. అయితే రెండ్రోజుల్లో వీకెండ్, క్రిస్మస్ సెలవులు ప్రారంభం కానుండటంతో పుష్ప 2 ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











