Pushpa 2 Day 17 collection : 1500 కోట్లతో పుష్ప 2 విధ్వంసం.. ఆ హీరోల సరసన అల్లు అర్జున్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ చిత్రం తన జైత్రయాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తోంది. రెండు వారాలకే రూ.1400 కోట్ల మార్క్‌ను చేరుకుని భారతీయ చిత్ర పరిశ్రమలో కొత్త బెంచ్ మార్క్‌లు సెట్ చేసింది. ఈ వారం కొత్త సినిమాల నుంచి పోటీ ఉన్నా తట్టుకుని నిలబడిన పుష్ప 2 కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో 17వ రోజు అల్లు అర్జున్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

పుష్ప 1 భారీ బ్లాక్ బస్టర్ కావడంతో పుష్ప 2 ది రూల్‌పై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది. దీనికి తోడు అల్లు అర్జున్ గెటప్, టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. దీంతో పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్‌కు భారీ డిమాండ్ నెలకొనడంతో పాటు భారీ ధరకు అమ్ముడయ్యాయి. దీంతో భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే తొలిసారిగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది పుష్ప 2. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైన ఈ సినిమాకు రూ.1200 కోట్ల గ్రాస్, రూ. 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా విలువ కట్టారు .
అంచనాలను నిజం చేస్తూ తొలిరోజు నుంచే బాక్సాఫీస్ వద్ద మోత మోగిస్తున్నాడు అల్లు అర్జున్. తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్ల వసూళ్లు రాబట్టింది పుష్ప 2. ఇదే జోరులో దంగల్, బాహుబలి 2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. అన్నింటికి మించి హిందీలో పుష్ప 2 ప్రభంజనం సృష్టిస్తోంది. కనివినీ ఎరుగని స్థాయిలో బాలీవుడ్ స్టార్ల రికార్డులను బద్ధలు కొడుతోంది.

రెండు వారాల పాటు ఎదురు లేకుండా సాగిన అల్లు అర్జున్ జోరుకి మూడో వారం కాస్త బ్రేక్ పడినట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హాలీవుడ్ మూవీ ముఫాసా ది లైన్ కింగ్, తమిళ చిత్రం విడుదల, తెలుగులో బచ్చలమల్లి సినిమాలు శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చాయి. కొన్ని చోట్ల దీని ప్రభావం పుష్ప 2పై పడినట్లుగా అంచనా వేస్తున్నారు. ఇక వీకెండ్ కావడంతో అన్ని చోట్లా బుకింగ్స్ బాగా జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.
17వ రోజు తెలుగు రాష్ట్రాలలో రూ.4.68 కోట్లు, హిందీలో రూ.21 కోట్లు, తమిళ్, కర్ణాటక, కేరళ + రెస్టాఫ్ ఇండియాలలో రూ. కోటి, ఓవర్సీలో రూ. 43 లక్షల చొప్పున ప్రపంచవ్యాప్తంగా రూ.26 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తద్వారా ఇప్పటి వరకు రూ. 1490 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది పుష్ప 2. ఆదివారం మార్నింగ్ షోల నాటికి పుష్ప 2 రూ.1500 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక 17వ రోజు నాటి వసూళ్లతో కలిపి రాయలసీమలో రూ.30 కోట్ల షేర్‌ను సొంతం చేసుకుంది పుష్ప 2. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో చిత్రంగా నిలిచింది. మరి థియేట్రికల్ బిజినెస్ ముగిసేసరికి ఇంకెన్ని కోట్లను రాబడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











