Pushpa 2 Day 2 collection : అల్లు అర్జున్ వసూళ్ల ఊచకోత .. రెండో రోజు పుష్ప 2కి ఎన్ని కోట్లంటే?
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప 2 ఊహించినట్లుగానే బాక్సాఫీస్ దుమ్ముదులిపేస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో మునుపెన్నడూ లేని విధంగా కలెక్షన్స్ కుమ్మేస్తున్నాడు పుష్పరాజ్. అల్లు అర్జున్ దెబ్బకు స్టార్లు, సూపర్‌స్టార్ల రికార్డులు బద్ధలవుతున్నాయి. తొలిరోజు విశ్వరూపం చూపించిన బన్నీ.. రెండో రోజు ఎలాంటి వసూళ్లు సాధిస్తాడో చూడాలి.
మూడేళ్ల క్రితం వచ్చిన యావత్ దేశాన్ని ఊపేసిన పుష్ప ది రైజ్ (పుష్ప పార్ట్ 1)కి సీక్వెల్‌గా సుకుమార్ పుష్ప ది రూల్‌ను తెరకెక్కించారు. అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా.. ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, రావు రమేష్, జగపతిబాబులు కీలకపాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్, పోస్టర్స్‌తో భారీ హైప్ రావడంతో ఇందుకు తగినట్లుగానే పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. థియేట్రికల్ , నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి రూ. 1000 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

తొలి రోజు ఇండియా వైడ్‌గా రూ. 180 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి దుమ్ములేపింది పుష్ప 2. తెలుగు రాష్ట్రాల్లో రూ.90 కోట్లు, హిందీలో రూ.69 కోట్లు, తమిళనాడులో రూ. 8 కోట్లు, మలయాళంలో రూ. 6 కోట్లు, కర్ణాటకలో రూ. 2కోట్లు , రెస్టాఫ్ ఇండియాలో రూ. 7 కోట్లు చొప్పున పుష్ప 2 ఓపెనింగ్స్ రాబట్టింది. ఓవర్సీస్‌లో రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించగా మొత్తంగా ఫస్ట్ డే అల్లు అర్జున్ మూవీ రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే సీడెడ్ ఏరియాలో పుష్ప రాజ్ సంచలనం సృష్టించాడు. ప్రీమియర్స్ , తొలి రోజు కలెక్షన్స్‌తో కలిపి ఈ ఏరియాలో రూ. 13 కోట్లకు పైగా షేర్ అందుకుని నాన్ ఆర్ఆర్ఆర్ మూవీస్‌లో బిగ్గెస్ట్ మూవీగా పుష్ప 2 నిలిచింది. జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ హిట్ దేవర తొలి రోజు రూ.8.4 కోట్లకు పైగా షేర్‌ను అందుకుని రికార్డు సృష్టించగా.. ఇప్పుడు దీనిని పుష్ప 2 బద్ధలుకొట్టింది. ఇక టాలీవుడ్ బిజినెస్‌కు మెయిస్ సెంటర్స్‌లో ఒకటైన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోనూ మొదటి రోజు వసూళ్ల పరంగా దేవర (రూ.1.17 కోట్ల ) రికార్డును పుష్ప 2 (రూ.1.65 కోట్లు) అధిగమించింది.

దీంతో ఫస్ట్ వీకెండ్‌లోనే రూ.500 కోట్లను పుష్ప2 అవలీలగా దాటేస్తుందని అల్లు అర్జున్ అభిమానులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రెండో రోజు పుష్ప 2 ఎలాంటి వసూళ్లను సాధిస్తుందో చూస్తే. శుక్రవారం వర్కింగ్ డే కావడంతో మార్నింగ్ షో, మ్యాట్నీలకు బుకింగ్స్ కాస్త డల్ అవ్వగా.. ఫస్ట్ షో, సెకండ్ షోలకు అన్ని చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు పడినట్లుగా ఫిలింనగర్ టాక్. రెండో రోజు ఈ సినిమా ఇండియా వైడ్‌గా రూ. 100 కోట్లకు పైగా రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని , ఓవర్సీస్‌తో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లు కొల్లగొట్టవచ్చని అంటున్నారు. చూద్దాం మరి పుష్పగాడు ఎలాంటి మేజిక్ చేస్తాడో.


Click it and Unblock the Notifications











