Pushpa 2 Day 21 collection : కుమ్మేసిన పుష్ప, 1600 కోట్లతో అల్లు అర్జున్ సంచలనం.. బాహుబలికి దగ్గరగా
క్రియేటివ్ జీనియస్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటికే అడ్డొచ్చిన ప్రతీ రికార్డును బద్ధలుకొడుతూ దూసుకెళ్తోంది ఈ సినిమా. అల్లు అర్జున్ జోరు చూస్తే ఇప్పట్లో తగ్గేలే కనిపించడం లేదు. హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా తన పేరిట రికార్డును నెలకొల్పిన పుష్ప 2 .. 21వ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లు సాధించిందో చూస్తే .
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

మూడేళ్ల క్రితం పుష్ప 1 దేశాన్ని ఊపేయడంతో దీనికి సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూశారు. అల్లు అర్జున్ గెటప్స్, టీజర్, ట్రైలర్లు ఇతర ప్రమోషన్ కార్యక్రమాలతో పాటు పుష్ప బ్రాండ్ కారణంగా పుష్ప2 ది రూల్‌కి ఎక్కడా లేని హైప్ వచ్చింది. దీంతో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది పుష్ప 2. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైన ఈ సినిమాకు రూ.1200 కోట్ల గ్రాస్, రూ. 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను నిర్దేశించాయి ట్రేడ్ వర్గాలు.
ఊహించిన విధంగానే తొలి వారంలోనే ఏకంగా రూ.1000 కోట్లను, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు రాబట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది పుష్ప 2. తద్వారా దంగల్, బాహుబలి 2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. దీనితో పాటు ప్రముఖ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్.. బుక్ మై షోలో అత్యధిక టికెట్లు బుక్ అయిన చిత్రంగానూ పుష్ప 2 స్థానం దక్కించుకుంది.
క్రిస్మస్ పర్వదినం కావడంతో 21వ రోజు అన్ని చోట్లా సాలీడ్ బుకింగ్స్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్లు, హిందీలో రూ.16 కోట్లు, తమిళనాడు, కేరళ, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలలో రూ. కోటి, ఓవర్సీస్‌లో రూ. 20 లక్షలు చొప్పున మొత్తంగా రూ.23 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది పుష్ప 2. దీనితో కలిపి ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా రూ. 1597 కోట్ల గ్రాస్ రాబట్టాడు అల్లు అర్జున్. 22వ రోజు మార్నింగ్ షోల వరకే రూ.1600 కోట్ల క్లబ్‌లోకి ఈ సినిమా చేరనుంది. మరో 200 కోట్లు కొడితే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎపిక్ బాహుబలి 2ని పుష్ప 2 కొట్టేస్తుంది. మరి లాంగ్ రన్‌లో పుష్ప 2 ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











