Pushpa 2 Day 48 collection : పుష్పగాడి మాస్ జాతర .. అల్లు అర్జున్ మూవీకి ఎన్ని కోట్లంటే?
సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ మరోసారి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 1850 కోట్లకు పైగా వసూళ్లు దుమ్మురేపిన ఈ సినిమా కలెక్షన్లకు సంబంధించి కేంద్ర ఆదాయపు పన్ను శాఖ అధికారులు.. ఈ చిత్ర నిర్మాతల ఇళ్లపై దాడులకు దిగడం చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పుష్ప 2 ..48వ రోజు ఎన్ని కోట్ల వసూళ్లు సాధించిందో చూస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

పుష్ప 2 ఏకంగా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి భారతీయ చిత్ర పరిశ్రమలోనే అరుదైన బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ. 620 కోట్ల షేర్, రూ. 1250 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైంది పుష్ప 2 . తొలి రోజే రూ. 294 కోట్ల ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా తొలి వారంలోనే రూ.1000 కోట్లు, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు, 32 రోజుల్లో రూ.1831 కోట్లు రాబట్టింది పుష్ప 2.
ఇప్పటి వరకు రూ.850 కోట్లకు పైగా షేర్ రాబట్టిన పుష్ప 2 .. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు రూ.220 కోట్లకుపైగా లాభాలను అందించింది. ఇలాంటి దశలో మైత్రీ అధినేతల ఇళ్లపై మంగళవారం ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా పుష్ప 2 ఇప్పటి వరకు ఏ రోజున ఎంత కలెక్ట్ చేసిందో ఆ వివరాలను అధికారులు సేకరించినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ సరిణామాలు జాతీయ స్థాయిలో మరోసారి పుష్ప 2 గురించి చర్చకు దారి తీశాయి.
47 రోజుల వరకు ఈ సినిమా నైజాంలో రూ. 104.42 కోట్లు, సీడెడ్‌లో రూ. 35.58 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 25.02 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 13.63 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 10.32 కోట్లు, గుంటూరులో రూ. 16.05 కోట్లు, కృష్ణాలో రూ. 13.16 కోట్లు, నెల్లూరులో రూ.8.18 కోట్లు, కర్ణాటకలో రూ. 53.35 కోట్లు, తమిళనాడులో రూ.34.85 కోట్లు, కేరళలో రూ. 7.60 కోట్లు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో రూ. 387.28 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 127.19 కోట్లు చొప్పున వసూళ్లు వచ్చాయి.
సంక్రాంతికి ముందు వరకు ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ పూర్తయినట్లేనని అంతా భావించారు. కానీ ఎప్పుడైతే 20 నిమిషాల అదనపు ఫుటేజ్‌ను రీలోడెడ్ వెర్షన్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిందో అప్పటి నుంచి లెక్కలు మారిపోయాయి. గత వీకెండ్ నుంచి పుష్ప 2 రోజుకు కోటిన్నరకు తగ్గకుండా కలెక్షన్లు రాబట్టింది. మంగళవారం పుష్ప 2కు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ తగ్గగా.. హిందీలో సాలీడ్ బుకింగ్స్ నమోదయ్యాయి. మొత్తంగా 48వ రోజు ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ సినిమాకు రూ. 50 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మరి లాంగ్ రన్‌లో పుష్ప 2 ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











