Pushpa 2 Day 5 collection : అల్లు అర్జున్ ఊచకోత.. 1000 కోట్లకు చేరువలో, ఐదో రోజు ఎన్ని కోట్లంటే?
సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప 1కి సీక్వెల్‌గా లేటెస్ట్‌గా వచ్చిన పుష్ప 2 ది రూల్ బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర సృష్టిస్తోంది. నాలుగు రోజుల వ్యవధిలోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఫస్ట్ వీకెండ్‌ను ఘనంగా ముగించాడు అల్లు అర్జున్. ఇప్పటికే చాలా ఏరియాలలో బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్ధలు కొట్టింది పుష్ప 2 ది రూల్. మరి ఐదో రోజు అల్లు అర్జున్ మూవీ ఎన్ని కోట్ల వసూళ్లు సాధించింది. ఈ వివరాల్లోకి వెళితే..
దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో పుష్ప 2ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. టీజర్ , ట్రైలర్, అల్లు అర్జున్ గెటప్స్‌తో భారీ హైప్ తెచ్చుకున్న పుష్ప 2కి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి దాదాపు రూ. 1000 కోట్లకు పైగా వ్యాపారం చేసింది పుష్ప 2.

దీంతో ఈ సినిమాకు రూ.1200 కోట్ల గ్రాస్, రూ. 620 కోట్ల షేర్ టార్గెట్‌ను నిర్దేశించారు ట్రేడ్ పండితులు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11000 థియేటర్లలో రిలీజైన పుష్ప 2 రికార్డు స్థాయిలో తొలి రోజు రూ. 294 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్‌ను రాబట్టి కొత్త చరిత్ర సృష్టించింది. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ. 700 కోట్ల వసూళ్లను అవలీలగా దాటేసి రూ.1000 కోట్ల దిశగా సాగుతోంది. విడుదలైన తొలి వారంలోనే రూ. వెయ్యి కోట్ల టార్గెట్‌ను పుష్ప 2 కొట్టేస్తుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.
నాలుగు రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 203 కోట్ల గ్రాస్.. రూ. 140 కోట్ల షేర్ సాధించింది పుష్ప 2. నైజాంలో రూ.62 కోట్లు, సీడెడ్‌లో రూ.22 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 15.10 కోట్లు, ఈస్ట్‌లో రూ.8.58 కోట్లు, వెస్ట్‌లో రూ. 6.79 కోట్లు, గుంటూరులో రూ. 11.14 కోట్లు, కృష్ణాలో రూ.8.91 కోట్లు, నెల్లూరులో రూ.5.05 కోట్ల చొప్పున వసూళ్లు రాబట్టింది పుష్ప 2. ఇక ఐదో రోజు అల్లు అర్జున్ మూవీ వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

వర్కింగ్ డే కావడంతో మ్యాట్నీ వరకు వసూళ్లు డల్ అయ్యాయి. అయితే ఫస్ట్ షో, సెకండ్ షోలకు మాత్రం సాలీడ్ బుకింగ్స్ జరిగినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 16 కోట్లు .. తమిళనాడు, కర్ణాటక, కేరళలలో రూ. 8 కోట్లు.. హిందీలో రూ.52 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.10 కోట్లు చొప్పున మొత్తంగా వరల్డ్ వైడ్‌గా ఐదో రోజు పుష్ప 2 రూ. 90 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మొత్తంగా ఐదు రోజుల్లో పుష్ప 2 వరల్డ్ వైడ్‌గా రూ.880 కోట్ల మార్క్‌ను దాటేసి.. రూ.1000 కోట్ల దిశగా దూసుకెళ్తోంది.


Click it and Unblock the Notifications











