Pushpa 2 Day 54 collection : అల్లు అర్జున్ ఎదురీత.. షాకిచ్చేలా పుష్ప 2 కలెక్షన్స్ , ఎన్ని కోట్లంటే?
సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ 50 రోజుల ఫీట్‌ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్‌కు కూడా ఈ సినిమా రానుంది. అయినప్పటికీ థియేటర్లలో అల్లు అర్జున్ మూవీకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. 50 రోజులు గడుస్తున్నప్పటికీ రోజుకు రూ. 50 లక్షల షేర్ వసూలు చేస్తూ ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది. ఈ నేపథ్యంలో 54వ రోజు పుష్ప 2 ఎంత వసూలు చేసిందో చూస్తే :
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

టీజర్, ట్రైలర్లు, పాటలు ఇతర ప్రమోషనల్ కార్యక్రమాల కారణంగా పుష్ప 2 ది రూల్‌పై భారీ హైప్ నెలకొంది. దీంతో పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. ఏకంగా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి తర్వాత రాబోయే సినిమాలకు సరికొత్త బెంచ్ మార్కులు సెట్ చేసింది. దీంతో ఈ సినిమాకు రూ. 620 కోట్ల షేర్, రూ. 1250 కోట్ల గ్రాస్‌ను బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా విలువ కట్టారు ట్రేడ్ పండితులు.
కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు గాను గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్లలో విడుదలైంది పుష్ప 2. తొలి రోజే రూ. 294 కోట్ల రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టి ఆశ్చర్యపరిచాడు అల్లు అర్జున్. తొలి వారంలోనే రూ.1000 కోట్లు, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు, 32 రోజుల్లో రూ.1831 కోట్లు రాబట్టింది పుష్ప 2.
ఇప్పటి వరకు రూ.850 కోట్లకు పైగా షేర్ రాబట్టిన పుష్ప 2 .. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు రూ.230 కోట్లకుపైగా లాభాలను పంచిపెట్టింది. 53 రోజుల వరకు ఈ సినిమా నైజాంలో రూ. 104.65 కోట్లు, సీడెడ్‌లో రూ. 35.65 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 25.04 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 13.63 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 10.32 కోట్లు, గుంటూరులో రూ. 16.08 కోట్లు, కృష్ణాలో రూ. 13.16 కోట్లు, నెల్లూరులో రూ.8.18 కోట్లు, కర్ణాటకలో రూ. 53.40 కోట్లు, తమిళనాడులో రూ.34.86 కోట్లు, కేరళలో రూ. 7.60 కోట్లు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో రూ. 388.40 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 127.26 కోట్లు చొప్పున వసూళ్లు రాబట్టింది.
కేరళలో థియేట్రికల్ బిజినెస్‌ను కంప్లీట్ చేసుకున్న పుష్ప 2.. తాజాగా తమిళనాడులోనూ ఎండ్ కార్డ్ వేసేసింది. అయితే లాంగ్ రన్‌లో తమిళ మార్కెట్‌లో ఈ సినిమాకు దెబ్బ పడినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. రూ.52 కోట్ల మేర ఇక్కడ బిజినెస్ జరగ్గా.. 80.50 కోట్ల గ్రాస్ , రూ.34.86 కోట్ల రేంజ్‌లో షేర్‌ను అందుకుంది. బిజినెస్‌తో పోలిస్తే రూ. 17.14 కోట్ల నష్టాలను తమిళనాడులో మూటకట్టుకుంది పుష్ప 2. కేవలం 67 శాతం మేర రికవరీతో ఓవరాల్‌గా ఫ్లాప్‌గా నిలిచింది. మొత్తంగా కేరళ, తమిళనాడులలో పుష్ప 2కి భారీ నష్టాలే వచ్చాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ఇక 54వ రోజు వసూళ్ల విషయానికి వస్తే.. తెలుగులో పుష్ప 2 బుకింగ్స్ పూర్తిగా పడిపోగా హిందీలో మాత్రం ఊచకోత కోస్తున్నాడు అల్లు అర్జున్. ఎమర్జెన్సీ, స్కో ఫోర్స్ వంటి సినిమాలు ఉన్నప్పటికీ గత వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 2 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు సాధించాడు అల్లు అర్జున్. సోమవారం వర్కింగ్ డే కావడంతో అన్ని ఏరియాలో బుకింగ్స్ పడిపోయాయి. 54వ రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.21 లక్షలు మాత్రమే రాబట్టింది పుష్ప 2. త్వరలో ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుండటంతో అల్లు అర్జున్ ఏ మేరకు వసూళ్లు రాబడతాడో చూడాలి.


Click it and Unblock the Notifications











