Pushpa 2 Collections : అల్లు అర్జున్ అరాచకం.. 1000 కోట్ల క్లబ్‌లోకి పుష్ప, నెక్ట్స్ టార్గెట్ కల్కియే!
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప 2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. నార్త్ , సౌత్ అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే చాలా ఏరియాలలో బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్ధలు కొట్టిన పుష్ప 2 తాజాగా మరో మైలురాయిని చేరుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ వివరాల్లోకి వెళితే.
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. టీజర్ , ట్రైలర్, తదితర ప్రమోషన్ కార్యక్రమాలతో భారీ హైప్ తెచ్చుకున్న పుష్ప 2కి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లో అమ్ముడు కాగా.. దాదాపు రూ. 1000 కోట్లకు పైగా వ్యాపారం చేసింది పుష్ప 2.

దీంతో ఈ సినిమాకు రూ.1200 కోట్ల గ్రాస్, రూ. 620 కోట్ల షేర్ టార్గెట్‌ను నిర్దేశించారు ట్రేడ్ పండితులు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11000 థియేటర్లలో డిసెంబర్ 5న రిలీజైన పుష్ప 2 ది రూల్ రికార్డు స్థాయిలో తొలి రోజు రూ. 294 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్‌ను రాబట్టి కొత్త చరిత్ర సృష్టించింది. వారం కూడా తిరక్కుండానే పలు రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసింది. ఆరో రోజుకే ఇండియన్ మూవీస్ పరంగా ఫాస్ట్‌గా రూ. 900 కోట్ల గ్రాస్ వసూళ్లని సాధించిన సినిమాగా పుష్ప 2 రికార్డుల్లోకెక్కింది.
ఈ ఏడాది సంచలన విజయం అందుకున్న శ్రద్ధా కపూర్ మూవీ స్త్రీ2 వసూళ్లను అల్లు అర్జున్ అధిగమించాడు. స్త్రీ2 టోటల్ రన్‌లో రూ. 870 కోట్ల గ్రాస్‌ను 60 రోజుల్లో సాధించగా.. దానిని పుష్ప 2 కేవలం ఐదు రోజుల్లోనే కొట్టిపడేసింది. తాజాగా ఈ సినిమా మరో ఘనతను అందుకుంది. రూ.1000 కోట్ల క్లబ్‌లోకి పుష్ప ఎంటరై అల్లు అర్జున్ కెరీర్‌లో ఈ ఘనత సాధించిన తొలి సినిమాగా నిలిచింది. పుష్ప 2 జోరు చూస్తుంటే త్వరలోనే ప్రభాస్ నటించిన కల్కి 2 టోటల్ కలెక్షన్స్‌ని అధిగమించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అల్లు అర్జున్‌కు స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న తెలుగు రాష్ట్రాల కంటే హిందీ బెల్ట్‌లోనే పుష్ప 2 ది రూల్‌కి ఆదరణ దక్కుతోంది. గడిచిన వారం రోజుల్లో తెలుగు కంటే హిందీలోనే ఈ పాన్ ఇండియా మూవీ అత్యధిక వసూళ్లు సాధించి అవలీలగా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. విడుదలైన తొలి వారానికే పరిస్ధితి ఇలా ఉంటే థియేటర్‌లో బిజినెస్ క్లోజ్ చేసే సమయానికి పుష్ప ఇంకెంత రాబడతాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











