Pushpa 2 Japan Box Office: జపాన్‌లో పుష్ప 2 కలెక్షన్ల సంచలనం.. అల్లు అర్జున్ మూవీకి ఎన్ని కోట్లంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా, ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, జగదీష్ భండారీ తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం పుష్ప 2. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది.
ఇండియన్ సినిమా హిస్టరీలో సంచలన విజయం సాధించిన చిత్రం పుష్ప 2. ఇప్పటి వరకు భారతీయ సినిమా చరిత్రలో ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసిన చిత్రంగా నిలిచిపోయింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 1800 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. దాదాపు 50 రోజులపాటు వరల్డ్ బాక్సాఫీస్‌ను పుష్ప రాజ్ కలెక్షన్లతో శాసించాడు. అయితే ఈ సినిమా ప్రస్తుతం జపాన్‌లో జనవరి 16వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా జపాన్ రిలీజ్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

జపాన్ రిలీజ్ నేపథ్యంలో అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతోపాటు హీరోయిన్ రష్మిక మందన్నతో కలిసి అక్కడికి వెళ్లి ప్రమోషన్స్ చేశారు. అల్లు అర్జున్, రష్మిక ప్రమోషన్స్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత తొలి రెండు మూడు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమా ఆతర్వాత అనూహ్యంగా పుంజుకొని భారీ వసూళ్లను సాధించింది.
జపాన్‌లో అల్లు అర్జున్ క్రేజ్‌కు మంచి స్పందన లభించడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రికార్డు స్థాయిలోనే వచ్చాయి. గత 14 రోజుల్లో ఈ సినిమా 17 వేల మంది చూశారు. దాంతో ఈ సినిమా 105 మిలియన్ యెన్స్ వసూలు చేసింది. భారతీయ కరెన్సీలో 6 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
జపాన్‌లో భారతీయ సినిమాల టాప్ 5 కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇప్పటి వరకు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన RRR చిత్రం 2.42 బిలియన్ యెన్స్ వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రజనీకాంత్ నటించిన ముత్తు సినిమా 405 యెన్స్ వసూళ్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత బాహుబలి 305 మిలియన్ యెన్స్, 3 ఇడియెట్స్ 170 మిలియన్ యెన్స్ వసూలు చేశాయి. 5వ స్థానంలో శ్రీదేవీ నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రం 160 మిలియన్ యెన్స్ వసూలు చేసింది. ప్రస్తుతం పుష్ప 2 చిత్రం 10వ స్థానంలో నిలిచింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక పుష్ప 2 చిత్రం వరల్డ్ వైడ్ లైఫ్ టైమ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 350 కోట్ల రూపాయలు, ఇండియా వైడ్ 1500 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 280 కోట్ల రూపాయలతో సుమారుగా 1800 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.


Click it and Unblock the Notifications











