Game Changer Day 1 Collection : వసూళ్ల గేమ్ మొదలెట్టిన గ్లోబల్ స్టార్ .. ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌ను తెచ్చుకుంది గేమ్ ఛేంజర్. గురువారం అర్ధరాత్రి నుంచి ఏపీ సహా ఓవర్సీస్‌లో స్పెషల్ షోలు పడ్డాయి. గురువారం రాత్రి నుంచే థియేటర్లకు ప్రేక్షకులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ తొలి రోజు ఎన్ని కోట్ల ఓపెనింగ్స్ రాబడుతుందోనని మెగా ఫ్యాన్స్, ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తుండటంతో పాటు తమిళ దర్శకుడు శంకర్ తొలిసారిగా ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. శంకర్ సినిమా అంటే ఒకప్పుడు బ్లాక్‌బస్టర్ పక్కా అన్న ఇమేజ్ ఉండేది. కానీ స్నేహితుడు మూవీ నుంచి పరిస్ధితులు తారుమారయ్యాయి. స్నేహితుడు, ఐ, రోబో 2.0 సినిమాలు పర్లేదు అనిపించుకున్నప్పటికీ కమర్షియల్‌గా అనుకున్నంత రాబట్టలేదని శంకర్ విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక గతేడాది విడుదలైన భారతీయుడు -2 ఆయన కెరీర్‌లోనే దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది.

శంకర్ ఔట్ డేటెడ్ అయిపోయారని , ఆయన పని అయిపోయిందని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని గేమ్ ఛేంజర్ తెరకెక్కించారు శంకర్. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, అంజలి , ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో గేమ్ ఛేంజర్ నిర్మించారు.
శంకర్ టేకింగ్, రామ్ చరణ్ ఇమేజ్ కారణంగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగిందని టాక్. ఇక పాటలు, టీజర్, ట్రైలర్లతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. అంతేకాదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో రికార్డు స్థాయిలో బిజినెస్‌గా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నైజాంలో రూ. 43 కోట్ల బిజినెస్, ఆంధ్రాలో రూ.75 కోట్లు , సీడెడ్‌లో 25 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగినట్టు సమాచారం. మొత్తంగా ఒక్క ఆంధ్రాలోనే ఈ సినిమా 100 కోట్ల మేర బిజినెస్ చేసుకొన్నది. ఇక నైజాంతో కలిపి 145 కోట్ల రూపాయల బిజినెస్‌ను తెలుగు రాష్ట్రాల్లో దక్కించుకుంది గేమ్ ఛేంజర్. ఈ సినిమా లాభాల్లోకి ప్రవేశించాలంటే.. కనీసం 150 కోట్ల రూపాయల షేర్, 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించాలి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు, ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా కావడంతో ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ ఎలాంటి ఓపెనింగ్స్ రాబడుతుందోనని ఉత్కంఠ నెలకొంది. స్పెషల్ షోలు, అడ్వాన్స్ బుకింగ్ కారణంగా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రూ.25 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. తమిళనాడు , కర్ణాటక + హిందీ మార్కెట్ కలిపి రూ.30 కోట్లు.. ఓవర్సీస్‌లో రూ.8 కలిపి మొత్తంగా తొలి రోజు రూ.65 నుంచి రూ.70 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే ఎలాంటి ఓపెనింగ్స్ రాబడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











