Game Changer Day 2 Collection : టఫ్ ఫైట్‌లో నిలబడ్డ రామ్ చరణ్ .. రెండో రోజు ఎన్ని కోట్లంటే?
ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , భారతీయుడు 2 తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తీసిన చిత్రం కావడంతో ఈ సినిమాపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ రాబట్టిన గేమ్ ఛేంజర్ రెండో రోజు ఎలాంటి వసూళ్లు రాబట్టిందో చూస్తే :
గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా.. అంజలి , ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో గేమ్ ఛేంజర్ నిర్మించారు దిల్‌రాజు. శంకర్ బ్రాండ్, రామ్ చరణ్ ఇమేజ్ కారణంగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగిందని ఫిలింనగర్ టాక్. ఇక పాటలు, టీజర్, ట్రైలర్లతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

ఈ నేపథ్యంలో నైజాంలో రూ. 43 కోట్ల బిజినెస్, ఆంధ్రాలో రూ.75 కోట్లు , సీడెడ్‌లో 25 కోట్ల చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోనే 145 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది గేమ్ ఛేంజర్. 150 కోట్ల రూపాయల షేర్, 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. స్పెషల్ షోలు, అడ్వాన్స్ బుకింగ్ కారణంగా గేమ్ ఛేంజర్ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 186 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
అయితే రూ.200 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబడుతుంది అనుకుంటే కేవలం రూ.186 కోట్ల దగ్గరే ఆగిపోవడంతో మెగా ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. రామ్ చరణ్ గత చిత్రాలలో ఆచార్య రూ.29.50 కోట్లు, ఆర్ఆర్ఆర్ రూ. 74.11 కోట్లు, వినయ విధేయ రామ రూ. 25.99 కోట్లు, రంగస్థలం రూ.19.50 కోట్లు , ధ్రువ రూ.10.40 కోట్ల షేర్ రాబట్టాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఇక రెండో రోజు గేమ్ ఛేంజర్ ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టిందో చూస్తే.. మిక్స్‌డ్ టాక్ కారణంగా తెలుగులో రూ. 13 కోట్లు, హిందీలో రూ.8 కోట్లు, తమిళనాడు + కర్ణాటకలో రూ.2.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.2 కోట్లు చొప్పున మొత్తంగా రూ.26 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది గేమ్ ఛేంజర్. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ డల్‌గా ఉన్నప్పటికీ, హిందీలో పుంజుకోవడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది. అయితే జనవరి 12 నుంచి నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ రిలీజ్ కావడంతో పాటు పుష్ప 2లో అదనంగా 20 నిమిషాల ఫుటేజ్ తదితర అంశాలతో గేమ్ ఛేంజర్ టఫ్ ఫైట్ ఎదుర్కొంటోంది. ఫస్ట్ వీకెండ్, సంక్రాంతి సీజన్ గడిస్తే కానీ గేమ్ ఛేంజర్ రిజల్ట్ ఏంటన్నది తెలియదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.


Click it and Unblock the Notifications











