బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్.. తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే!
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని కీలక సన్నివేశాల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. కుటుంబ కుట్రల చిత్రం అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ చిత్రం అనేక వివాదాలను, అవరోధాలను అధిగమిస్తూ ముందుకెళ్తున్నది. ఈ చిత్రం మొదటి రోజు ఎంత వసూలు చేసిందంటే...

ఏపీలో రిలీజ్ నిలిపివేత
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు ప్రధానాంశంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరకెక్కడంతో అత్యంత వివాదంగా మారింది. ఎన్నికల సమయంలో ఈ సినిమాను విడుదల చేయవద్దంటూ ఫిర్యాదు చేయడంతో ఏపీ హైకోర్టు ఈ చిత్ర రిలీజ్‌పై స్టే ఇచ్చింది. దాంతో ఏపీ మినహా ఇతర ప్రాంతాల్లో భారీ స్థాయిలో రిలీజ్ అయింది.

యూఎస్‌లో భారీగా రిలీజ్
ఓవర్సీస్ మార్కెట్‌లో ముఖ్యంగా అమెరికాలో గురువారం 125 స్క్రీన్లలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రీమియర్లను ప్రదర్శించారు. అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీగా ఉండటంతో సినిమా మంచి ఒపెనింగ్స్‌తో మొదలైంది. గురువారం ప్రదర్శించిన ప్రివ్యూ షోలతో ఈ సినిమా 90,214 డాలర్లు వసూలు చేసింది.

తొలి రోజు అమెరికా కలెక్షన్లు
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై పాజిటివ్ టాక్ నెలకొనడంతో శుక్రవారం అమెరికాలో భారీ స్పందన నెలకొన్నది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 145,928 డాలర్లు వసూలు చేయడం విశేషం. శని, ఆదివారం వీకెండ్ కావడంతో ఈ సినిమా మరిన్ని కలెక్షన్లను రాబట్టేందుకు ఛాన్స్ ఉంది.

ప్రపంచవ్యాప్తంగా రూ.4 కోట్లు
తెలంగాణ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి మంచి స్పందన వ్యక్తమవుతున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తొలి రోజున రిలీజైన అన్ని చోట్ల 100 శాతం అక్యుపెన్సీ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సుమారు రూ.4 కోట్ల గ్రాస్ వసూళ్లును రాబట్టినట్టు సమాచారం. శనివారం, ఆదివారం కూడా ఇదే పరిస్థితి ఉండవచ్చు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఆర్టీసీ క్రాస్ రోడ్డులో రికార్డు
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు అనూహ్య స్పందన లభిస్తున్నది. సంధ్య 35 ఎంఎంలో శుక్రవారం అన్ని షోలు హౌస్ ఫుల్ కావడం సినిమాపై ప్రేక్షకాదరణకు అద్దంపట్టింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. సంక్రాంతి పండుగకు రిలీజైన భారీ హీరోల సినిమాలకు కూడా ఇలాంటి పరిస్థితి లేకపోయింది అని పలువురు పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











