Ranga Maarthanda: రంగమార్తాండకు షాకింగ్ కలెక్షన్లు.. టాక్ ఒకలా వసూళ్లు మరోలా.. మొత్తం ఇంతేనా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాంటి వారిలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ ఒకరు. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఆయన.. చాలా గ్యాప్ తర్వాత రూపొందించిన చిత్రమే 'రంగమార్తాండ'. వైవిధ్యమైన స్టోరీతో కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. కానీ, కలెక్షన్ల పరంగా మాత్రం అంతగా రాణించలేదు. ఈ నేపథ్యంలో 'రంగమార్తాండ' ఫస్ట్ డే బాక్సాఫీస్ రిపోర్టును చూద్దామా!

రంగమార్తాండ అంటూ వచ్చారు
ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే 'రంగమార్తాండ'. కృష్ణ వంశీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రాజశ్యామలా ఎంటర్‌టైన్‌మెంట్స్, హౌస్‌ఫుల్ మూవీస్ బ్యానర్లపై మధు, వెంకట రెడ్డి నిర్మించారు. ఇందులో బ్రహ్మానందం, రాహుల్ సిప్లీగంజ్, శివాత్మిక రాజశేఖర్, అనసూయ భరద్వాజ్, అలీ రేజా, అదర్శ్‌లు నటించారు. ఇళయరాజా సంగీతాన్ని అందించారు.

రంగమార్తాండ బిజినెస్ డీటేల్స్
మరాఠిలో 'నటసామ్రాట్' అనే టైటిల్‌తో రూపొందిన చిత్రాన్ని కృష్ణ వంశీ 'రంగామార్తాండ' పేరుతో తెలుగులోకి రీమేక్ చేశారు. ఈ మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ చిత్రానికి మంచి డిమాండ్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.30 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుందని తెలిసింది.

అలాంటి టాక్‌తో... వసూళ్లు ఇలా
ఎన్నో అంచనాల నడుమ రూపొందిన 'రంగమార్తాండ' మూవీ ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ మాత్రం వచ్చింది. అందుకు అనుగుణంగానే రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. దీంతో ఈ సినిమాకు అనుకున్న విధంగా ఓపెనింగ్ డేన కలెక్షన్లు వచ్చే అవకాశం ఉండదని విశ్లేషకులు తెలిపారు.

మొదటి రోజు ఎంత రాబట్టింది?
'రంగమార్తాండ'కు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే అనుకున్న రేంజ్‌లో వసూళ్లు రాలేదు. ఫలితంగా నైజాంలో రూ. 18 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి.. రూ. 43 లక్షలు షేర్, రూ. 95 లక్షలు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?
ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చిన 'రంగమార్తాండ' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో మొదటి రోజు రూ. 43 లక్షలు మాత్రమే వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ప్రాంతాల్లో కలుపుకుని కేవలం రూ. 5 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మొదటి రోజు ఈ చిత్రానికి రూ. 48 లక్షలు షేర్‌తో పాటు రూ. 1.18 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఇలా.. ఇంకెంత రావాలి?
ఎంతో మంది సీనియర్లు నటించిన 'రంగమార్తాండ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.60 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 48 లక్షలు మాత్రమే వచ్చాయి. అంటే మరో రూ. 2.12 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











