శాటిలైట్ రేట్ లోనూ రవితేజ 'పవర్' చూపాడు
హైదరాబాద్ : రవితేజ హీరో గా తెరకెక్కుతున్న చిత్రం 'పవర్'. హన్సిక హీరోయిన్ . కె.ఎస్.రవీంద్రనాథ్ (బాబి) దర్శకుడుగా పరిచయమవుతున్నారు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాత. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని అమ్మేసినట్లు సమాచారం. జెమినీ టీవి వారు ఈ రైట్స్ ని ఏడున్నర కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రవితేజ చిత్రానికి టీఆర్పిలు బాగుంటాయని..అందులో బలుపు హిట్ తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగిందని ఆ రేటు పెట్టారని చెప్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బ్యాంకాక్‌లో జరుగుతోంది. రవితేజ, ఇతర ప్రధాన తారాగణంపై భారీ ఛేజ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు అక్కడ చిత్రీకరణ ఉంటుంది. చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
నిర్మాత మాట్లాడుతూ...''మాస్, క్లాస్ వర్గాల ప్రేక్షకుల్ని అలరించే హీరో రవితేజ. ఆయన శైలికి తగ్గట్టుగా రూపొందిన కథ ఇది. మాస్ పోలీసు.. క్లాస్‌గా ఏం చేశాడో తెరపై చూడాల్సిందే. చిత్రీకరణ చివరి దశకొచ్చింది. త్వరలో పాటల విడుదల తేదీని ప్రకటిస్తాము'' అంటున్నారు.

మాస్ అంటే బస్‌పాస్ కాదు... ఎవడుపడితే వాడు వాడేసుకోవడానికి. అది మన బలుపు, బాడీలాంగ్వేజ్ బట్టి జనం పిలుచుకునే పిలుపు వంటి మాస్ డైలాగులతో ఈ చిత్రం రవితేజ కెరీర్ లో లాండ్ మార్క్ గా మిగులుతుందని అంటున్నారు. ''అటు ప్రేక్షకుల్నీ, ఇటు నిర్మాతల్నీ సంతోషపెట్టే కథలే ఎంచుకొంటాను. ముందు నుంచీ నా ప్రయాణం ఇలానే సాగింది. ఇక ముందు కూడా ఇంతే. డబ్బులు రాని ప్రయోగాలు చేయడం నాకు ఇష్టం ఉండదు'' అని చెప్తున్నారు రవితేజ. బాబి చెప్పిన కథ బాగా నచ్చిందని, సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని రవితేజ తెలిపారు.
రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి) దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హన్సిక తొలిసారిగా రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, ముఖేష్ రుషి, రావూ రమేష్, సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖావాణి, జోగి బ్రదర్స్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్.తమన్, కెమెరా:ఆర్థర్ ఎ.విల్సన్, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, మాటలు:కోన వెంకట్, నిర్మాత:రాక్‌లైన్ వెంకటేష్, కథ, దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి).


Click it and Unblock the Notifications











