Vyooham Closing Collections 25 కోట్ల బడ్జెట్.. దారుణంగా వసూళ్లు.. ఎన్ని కోట్ల నష్టమంటే?
శ్రీ రామదూత క్రియేషన్స్, ఆర్జీవి డెన్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన చిత్రం వ్యూహం. సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రూపొందించిన ఈ సినిమా మార్చి 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ చిత్రంలో వైఎస్ జగన్ పాత్రను తమిళ నటుడు అజ్మల్ అమీర్ పొషించారు. వైఎస్ భారతీ పాత్రలో మానస రాధాకృష్ణన్ కనిపించారు. ఈ సినిమాలో చంద్రబాబుగా ధనుంజయ్ ప్రభునే, ఇతర పాత్రల్లో సురభి ప్రభావతి, రేఖ నిరోషా, వాసు ఇంటూరి, కోట జయరాం, ఎలీనా తుటేజా తదితరులు నటించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్, క్లోజింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
వ్యూహం సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇక సినిమా అనేక మార్లు వాయిదా పడటం, న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కోవడంతో ఖర్చు మరింత పెరిగింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే సరికి.. ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తంగా సుమారుగా 25 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని సినీ, ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ మూవీని రిలీజ్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు ముఖం చాటేశారు. దాంతో ఈ సినిమాను చాలా వరకు సొంతంగానే రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమా బిజినెస్ వివరాలు మాత్రం బయటకు రాలేదు. అలాగే శాటిలైట్, ఓటీటీ బిజినెస్ కూడా ఇంకా కాలేదనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 600 స్క్రీన్లలో, ఇతర రాష్ట్రాలు, అమెరికాలో కలిపి 750 పైగా స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు తెలిసింది.
వ్యూహం మూవీ విషయానికి వస్తే.. ఈ సినిమా పొలిటికల్ సినిమా కావడంతో రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులు సానుకూలంగా స్పందిస్తే.. ఇతర పార్టీల శ్రేణులు ప్రతికూలంగా స్పందించారు. దాంతో ఈ సినిమాకు వన్‌సైడ్ టాక్ క్రియేట్ కాలేదనేది తాజా సమాచారం. దాంతో గతం వారం రోజులుగా ఈ సినిమా పేలవమైన ఆక్యుపెన్సీని నమోదు చేసింది.
వ్యూహం సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల రూపాయలు, రెండో రోజు 30 లక్షలు రూపాయలు, మూడో రోజు 20 లక్షలు, నాలుగో రోజు 10 లక్షలు, ఐదో రోజు 10 లక్షలు వసూలు చేసింది. ఇక ఆరో రోజు 10 లక్షల కంటే తక్కువగానే నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా మొత్తంగా ఒక 1.3 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

సుమారుగా ఈ సినిమా 15 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమా బడ్జెట్‌లో ఒక శాతం కూడా రెవెన్యూను సాధించలేకపోయిందనే ఇండస్ట్రీలో టాక్. దాదాపుగా ఈ సినిమా 20 కోట్లకుపైగా నష్టంతో థియేట్రికల్ రన్ ముగించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











