RRR 50 Days: తగ్గేదేలే అంటూ మున్ముందుకు.. ఎన్ని సెంటర్లలో 50 రోజులు ఆడిందంటే?
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. RRR (రౌద్రం రణం రుధిరం) పేరుతో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఇక ఈ సినిమా సుమారు రూ.1100 కోట్ల పైచిలుకు వసూళ్లతో బాక్సాఫీస్ ముందు దుమ్ము దులిపింది అనే చెప్పాలి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం చూస్తూ చూస్తూ ఉండగానే 50 రోజులు పూర్తి చేసుకుంది.
ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500 స్రీన్లలో 50 రోజులను పూర్తి చేసుకుందని అంటున్నారు. ఈ మేరకు RRR టీమ్ ట్విట్టర్‌లో అధికారికంగా ప్రకటించింది. 'RRR సినిమా ప్రపంచ వ్యాప్తంగా 500 సినిమా హౌసుల్లో 50 రోజులను పూర్తి చేసుకుని జైత్రయాత్రను ఇంకా కొనసాగిస్తోంది. మీ రెస్పాన్స్‌కు ధన్యవాదాలు'' అని RRR చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన ఒలీవియా మోరిస్ నటించారు. అజయ్ దేవగన్ ప్రత్యేక పాత్రలో కనిపించగా శ్రియ శరణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణలు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సుమారు నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మించారు.

ఇక ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చగా తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది. ఇక 50 రోజుల సెలెబ్రేషన్స్‌ను టీమ్ శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని ఆర్ టీ సీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సుదర్శన్ 35 MMలో ఘనంగా జరిపింది. రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఈ సంబరాలు ఘనంగా జరిగాయి. RRR సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 451 కోట్ల బిజినెస్ చేయగా... 453 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే బ్రేక్ ఈవెన్ సాధించి ఈ సినిమా ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తుంది.. అది అలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ నెల 20 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. అయితే హిందీ స్ట్రీమింగ్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











